మాస్కు ఏది సార్లు.. మెప్పు కోసం ముప్పు గమనించరా?

by Sridhar Babu |
Corona virus, teachers
X

దిశ, కొత్తగూడెం: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెంది దాదాపు రెండు సంవత్సరాలు ప్రపంచ దేశాలను గడగడలాడించింది. మహమ్మారి దెబ్బకు కండ్లముందే అనేకమందిని కోల్పోయాం. దీంతో చేసేదేంలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 18 నెలల పాటు బడులు మూతపడ్డాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ నుంచి ఎలాగోలా బయటపడి ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరలోనే థర్డ్ వేవ్ పొంచి ఉందన్న వార్తలు జోరందుకున్నా.. ప్రభుత్వం స్కూళ్లు రీ ఓపెన్ చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్కూల్ ఓపెన్ కావడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైన జాగ్రత్తలతో పిల్లలకి విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అంబేద్కర్ భవన్‌లో ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన, సత్కారాల సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మాన, సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగానే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా సన్మాన సభ నిర్వహించి, ఒకరినొకరు అభినందించున్నారు.

అయితే.. ఉదయం పాఠశాలకు వెళ్లింది మొదలు విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు బాధ్యత మరచి ప్రవర్తించారు. కరోనా సోకుతుందన్న భయం లేకుండా, గుంపులు గుంపులుగా ఒకేచోట చేరి సన్మాన, సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఒక్కరికి కూడా మాస్కు లేకపోవడం గమనార్హం. హాజరైన రెండు వందల మందిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా.. అందరికీ వ్యాప్తి చెందడంతో పాటు విద్యార్థులకు సోకే ప్రమాదం ఉంది. దీంతో పిల్లలకు ప్రత్యక్షంగా కరోనా వ్యాప్తికి వీరే కారణం అవుతున్నారు. పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన గురువులే ఇలా మెప్పులకు పోయి ముప్పు తెచ్చి పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి విపత్కర పరిస్థితులలో సన్మానాలు, సత్కారాలు ఎందుకని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సన్మానం పొందిన వారిలో సుమారు 15 మంది ఉపాధ్యాయులు అయినప్పటికీ విద్యాశాఖ వారికి అదనపు బాధ్యతలు అప్పగించింది, అలాంటి వారిని ఉత్తమ ఉపాధ్యాయులని ఎలా సన్మానిస్తారని కొంతమంది ఉపాధ్యాయులు చెవులు కొరుక్కోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే అజాగ్రత్తగా ఉండకూడదని పలువురు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed