భయపడకండి.. అవగాహన కోసమే కార్డెన్ సెర్స్: ఎస్పీ వెంకటేశ్వర్లు

by Sumithra |
భయపడకండి.. అవగాహన కోసమే కార్డెన్ సెర్స్: ఎస్పీ వెంకటేశ్వర్లు
X

దిశ, జడ్చర్ల: ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తామని.. ప్రజలు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ ఏరియాలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 100 మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 బొలేరో వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. పాత బజార్ కాలనీ ప్రజలతో ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ నివసించడం సర్వసాధారణం అన్నారు. కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ముందు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు. కాలనీలో అక్రమ బెల్టుషాపులు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మరాదని.. ముఖ్యంగా ప్రజలు మద్యానికి బానిస కాకూడదని సూచించారు. ఎవరైనా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్, రౌడీషీట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీతో పాటు సుమారు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed