వివాదాస్పదంగా ఎమ్మెల్యేల తీరు

by Anukaran |
వివాదాస్పదంగా ఎమ్మెల్యేల తీరు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రజాప్రతినిధులు సహనం కోల్పోయి నోరు జారుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, మీడియాపై చిందులు వేస్తున్నారు. మహిళా తహసీల్దార్‌పై ఇటీవలే నోరు పారేసుకున్న నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తీరును మరిచిపోకముందే ఉమ్మడి జిల్లాలో మరో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతోంది. టీఆర్ఎస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకతను ఆయా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారు తోంది. ఇటీవలే మహిళా తహసీల్దార్‌పై నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి బూతు పురాణం అందుకున్న విషయం మరువక ముందే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రచ్చకు ఎక్కారు. అడ్డాకుల మండలంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహనం కోల్పోయి ఓ మహిళా ప్రజాప్రతినిధి పై నోరుపారేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఈ ఘటనను చీత్రికరించిన మీడియాపైనా చిందులు తొక్కడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోజు రోజుకూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అధికార పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం దీనిని బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకోగా జిల్లాకు చెందిన ఓ మంత్రి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఎన్నికల్లో తిరుగులేని పట్టు సాధించిన టీఆర్ఎస్.. తక్కువ కాలంలోనే తమ పట్టుకోల్పోతున్నదనే వాదన బలంగా వినిపిస్తోంది.

సహనం కోల్పోతున్నారు..

జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పలు సమావేశాల్లో ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక సహనం కోల్పోతున్నారు. చివరకు వారి తమ కోపాని అధికారులపై, ఇతర ప్రజాప్రతినిధులపై చూపుతుండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. మహిళా అధికారులు అని చూడకుండా నోరు పారేసుకోవడం‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దామరగిద్ద మండలలో నిర్వహించిన ఓ సమావేశానికి నారాయణ‌పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు. మండలంలో అనేక పనులు మందకోడిగా సాగడంతో పాటు చాలా మంది రైతులకు నేటికీ పాసుబుక్‌లు రాలేదని సభలో కొంతమంది ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మహిళా తహసీల్దార్‌ను నిలదీశారు. ఆమె చెబుతున్న సమాధానం వినకుండానే సదరు అధికారిణిపై ఎమ్మెల్యే పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన పనులకు సైతం తమనే బాధ్యులను చేయడం ఎంత వరకు సబబు అని అధికారులు వాపోతున్నారు.

శనివారం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి దేవరక్రద ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకల్ రగడ రాజుకుంది. తనకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రోకటల్ పాటించకుండా కార్యక్రమం నిర్వహించడం పట్ల రాణిపేటకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి సభలోనే ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆమెపై నోరు పారేసుకున్నారు. ‘నీకు ఎవ్వరు సమాచారం ఇస్తారు… ఉరికే గొడవ చేయకు… నోరుమూసుకుని కూర్చో’ అంటూ అనడంతో పలువురు ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై సైతం ఎమ్మెల్యే చిందులు తొక్కారు. ‘గొట్టాలు పట్టకుని తిరిగుతూ… స్టీకర్లు అంటించుకుని.. సోషల్ మీడియా వేదికగా అర్బాటాలు చేస్తారు’ అంటూ మాట్లాడటం పై వివిధ రాజకీయపక్షాలతో పాటు మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రిపై ఆరోపణలు…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి చిన్న విషయంలో అనుసరించిన వైఖరి.. నేడు ఆయన‌పై వెలెత్తేలా చేశాయి. ఇటీవల ఓ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పండుగసాయన కుటుంబానికి జిల్లాకు చెందిన మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రసంగంపై అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యతిరేకించారు. మరుసటి రోజు మరోవర్గం వారు మహబూబ్‌నగర్ ఆర్అండ్‌బీ అతిథి గృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రి‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరిగి అదే రోజు సాయంత్రం మంత్రికి సంబంధించిన అదే వర్గానికి చెందిన మరికొంత మంది నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలికిచిలికి గాలివానగా మారిన ఈ వివాదం చివరకు సోషల్ మీడియా వేదికగా తారాస్థాయికి చేరింది.

ప్రభుత్వ ఆర్అండ్‌బీ అతిథి గృహం వేదికగా నిర్వహించిన ఈ మీడియా సమావేశాలు చివరకు దానికి తాళం తాళం పడే పరిస్థితికి తీసుకువచ్చాయి. ఇష్టానుసారంగా సమావేశాలు, సభలు నిర్వహించడం వల్ల విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో అతిథి గృహానికి తాళం వేసామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రిపై విమర్శలు చేసిన మరుసటి రోజు నుండే గెస్ట్ హౌజ్‌కు తాళం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ అర్థం అవుతుందని పలువురు అంటున్నారు. కాని ఇదే వేదికగా గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంతో పాటు గతంలో పనిచేసిన అనేక మంది పాలకులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై విమర్శలు చేసిన విషయాన్ని నేటి పాలకులు మరిచిపోవడం శోచనీయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. వారిపై విమర్శలు చేస్తే భరించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్షమాపణలు చెప్పాలి : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్

చేసిన తపును కప్పిపుచుకునేందుకు మీడియాపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌గౌడ్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధికారంతో, అహంకారంతో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం పద్దతి కాదన్నారు. ఇది తన స్థాయిని దిగదార్చుకోవడమేనని తెలిపారు. ప్రజా సమస్యలను, ప్రతి అంశాన్ని ప్రపంచానికి తెలియజేసే మీడియానూ గొట్టాలంటూ సహనం కోల్పోయి చిందులేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చి.. ప్రజా ప్రతినిధి అని చూడకుండా ఓ మహిళా నేతను సభలో ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. మహిళలకిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెయ్యి చూపిస్తూ బెదిరించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర‌రెడ్డి సదరు మహిళా ప్రజాప్రతినిధికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story