ప్రమోషన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు..

by Shyam |
ప్రమోషన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు..
X

దిశ, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు జీతంతోపాటు భద్రత, పదోన్నతి లాంటివి ఆశిస్తారు. చాలా శాఖల్లో పదోన్నతులు లభిస్తూనే ఉన్నాయి. కానీ, పోలీసు శాఖలో మాత్రం నత్తనడకలా సాగుతోంది. ఈ శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వు, సివిల్, స్పెషల్ పోలీస్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో రకమైన సర్వీసు నిబంధనలు ఉన్నాయి. సివిల్ విభాగంలో ఎస్ఐ నుంచి ఇన్ స్పెక్టర్, ఆపై స్థానాలకు ప్రమోషన్లు లభిస్తున్నా.. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోషన్ పొందాలంటేనే పెద్ద ప్రహసనంగా మారుతోంది. దశాబ్దాలు గడిచిపోతున్నా.. పదోన్నతి లేకుండానే కానిస్టేబుళ్లు రిటైర్ కావాల్సిన దుస్థితి నెలకొంది. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లే ప్రమోషన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు పోలీస్ శాఖలో సివిల్ వర్సెస్ ఏఆర్ (కన్వర్షన్ కానిస్టేబుళ్ల) మధ్య వార్ నడుస్తోంది. దీంతో సివిల్ కానిస్టేబుళ్లకు రెండేళ్లుగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.

వివాదంగా మారిన కన్వర్షన్..

పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లు ఎక్కువ, హెచ్‌సీ పోస్టులు పరిమితంగా ఉంటాయి. అందువల్ల కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కూడా తక్కువగానే ఉంటాయి. దీంతో ఒక్కో బ్యాచ్‌కు చెందిన పీసీలను ప్రమోషన్లలో సర్దుబాటు చేసేందుకు డిపార్టుమెంటుకు చాలా సమయం పడుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1990 బ్యాచ్ కు చెందిన పీసీల ప్రమోషన్లకు కసరత్తు జరుగుతుండగా.. అర్ధాంతరంగా ఆపాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, ఆర్మ‌డ్ రిజర్వ్డ్ (ఏఆర్) కానిస్టేబుళ్ల రిక్రూట్ అయిన తర్వాత ఐజీ, డీఐజీ తదితర ఉన్నతాధికారుల వద్ద సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి వచ్చేందుకు కన్వర్షన్ ట్రాన్స్‌ఫర్ జీవో నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారం ఏఆర్‌లో పదేండ్లు సర్వీస్ చేస్తే, సివిల్ కానిస్టేబుల్‌గా వచ్చేందుకు ఏడు సంవత్సరాల సర్వీస్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా సుమారు వెయ్యి మంది ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి వచ్చినట్లు అంచనా. అయితే, ప్రమోన్లలో మొత్తం సర్వీస్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఏఆర్ కానిస్టేబుళ్లు పట్టుబడుతున్నారు. ఏఆర్ విభాగానికి ఎంపికైన కానిస్టేబుళ్లు కన్వర్షన్ ట్రాన్స్‌ఫర్ జీవో ప్రకారం సివిల్ విభాగానికి బదిలీపై వచ్చి అదే జీవో నిబంధనలకు విరుద్ధంగా మొత్తం సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఎలా అడుగుతారని సివిల్ కానిస్టేబుళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. 1990 బ్యాచ్ పీసీలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. దీంతో కన్వర్షన్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో సివిల్ విభాగానికి వచ్చిన ఏఆర్ కానిస్టేబుళ్లు 2018లో కోర్టును ఆశ్రయించారు. అప్పటికే కొన్ని జిల్లాలకు ప్రమోషన్లు కల్పించిన ఉన్నతాధికారులు, కోర్టు వివాదంతో మిగతా జిల్లాల్లో నిలిపివేయాల్సి వచ్చింది.

వేర్వేరుగా రిక్రూట్‌మెంట్లు

రాష్ట్ర పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ విభాగాల్లో నియామకాలు వేర్వేరుగా నిర్వహిస్తారు. సివిల్ కానిస్టేబుల్‌గా నియామకం కావాలంటే గ్రౌండ్ టెస్టులతో పాటు రాత పరీక్షలో కూడా మెరిట్ సంపాదించాల్సి ఉంటుంది. అనంతరం ట్రైనింగ్‌లో 6 నెలల గ్రౌండ్ శిక్షణతో పాటు అదనంగా మరో 3 నెలలు లా ట్రైనింగ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ ట్రైనింగ్‌లో ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎస్ఎల్ఎల్, లోకల్ లా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంశాలను బోధన చేస్తారు. శిక్షణ ఆఖర్లో ఈ సబ్జెక్టులన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఫిట్ ఫర్ నాట్ కానిస్టేబుల్ అని వెనక్కు పంపుతారు. కానీ ఏఆర్, స్పెషల్ పోలీస్ విభాగాల్లో ఫిజికల్ టెస్టు ద్వారా మాత్రమే నియామకం అవుతారు. ఎంపిక తర్వాత నిర్వహించే 6 నెలల ట్రైనింగ్‌లో కేవలం గ్రౌండ్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. సివిల్ విభాగానికి ఉన్నట్టు వీళ్లకు అదనంగా 3 నెలలు లా ట్రైనింగ్ లేకుండానే శిక్షణ పూర్తవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ విభాగానికి ఎంపికైన వారిని సివిల్ విభాగానికి అనుమతించడం సరైంది కాదని సివిల్ కానిస్టేబుళ్లు చేప్తున్నారు. 6 నెలలు ట్రైనింగ్ చేసిన ఏఆర్ కానిస్టేబుళ్లు.. 9 నెలలు ట్రైనింగ్ (విత్ లా సబ్జెక్టు) పూర్తి చేసిన సివిల్ కానిస్టేబుళ్లను సమానంగా ఎలా చూస్తారని పలువురు సివిల్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన కన్వర్షన్ ట్రాన్స్ ఫర్ జీవోను గౌరవించి మాట్లాడినా.. జీవో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లలో మొత్తం సర్వీస్ ను ఎలా పరిగణనలోకి తీసుకోవాలని అడుగుతారని సివిల్ కానిస్టేబుళ్లు నిలదీస్తున్నారు.

సంప్రదింపులు ఫలించలేదు: గోపిరెడ్డి, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం ఎస్ఐ పోస్టులకు డైరెక్ట్ నియామకాలు చేపడుతోంది. కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్లపై వచ్చేవారికి 30 శాతం కోటా ఉంది. ఈ ప్రకారం కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా, అక్కడి నుంచి ఎస్ఐగా ప్రమోషన్ పొందాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్‌‌లో అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి. అందువల్ల కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ప్రమోషన్‌ పొందాలంటే సంవత్సరాలు పడుతుంది. కొందరికి సర్వీసు మొత్తం పూర్తయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌సీ నుంచి ఎస్ఐకు మధ్య ఏఎస్ఐ అనే పోస్టు క్రియేట్ అయింది. డిపార్టుమెంట్లలో ఉన్నతాధికారుల చొరవతో రిటైర్మెంట్ ఆఖరి రోజు లేదా రెండ్రోజుల ముందు ఆత్మ తృప్తి కోసం ఏఎస్ఐ లేదా ఎస్ఐ ప్రమోషన్ అవకాశం కల్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

Advertisement

Next Story

Most Viewed