ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమాలు

by Mahesh |
ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సుదర్శన, గణపతి, నవగ్రహ చండీ హోమాలు నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆలయంలో ఉదయం తెల్లవారు జాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆహ్వానం పంపినట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజ, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అదే విధంగా అటవీశాఖ ఏడాది కాలంలో సాధించిన లక్ష్యాలను, విజయాలకు సంబంధించిన బ్రోచర్ ను సైతం విడుదల చేయనున్నారు. అనంతరం కొండాపూర్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్ కు శంకుస్థాపన, కొత్తగూడెం - పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అనంతరం వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఎఆర్ విఆర్ బిల్డింగ్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన వాహనాలను ప్రారంభించనున్నారు.

ప్రకృతి సహజ ధర్మాలకు విఘాతం కలగకుండా చూడాలి

ప్రకృతి సహజ ధర్మాలకు విఘాతం కలగకుండా వ్యవహరించడమే మనుషులుగా వన్యప్రాణుల సంరక్షణకు మనం నిర్వర్తించే అత్యుత్తమ విధి అని మంత్రి కొండా సురేఖ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం (డిసెంబర్ 4) సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్న అటవీశాఖ సిబ్బందిని, ప్రకృతి ప్రేమికులకు అభినందించారు. జీవవైవిధ్యంలో భాగమైన వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ప్రాధాన్యత తో కూడిన అంశమన్నారు. వన్యప్రాణులు, వృక్షసంపద, మనుషులకు మధ్య అవినాభావ సంబంధమున్నదని పేర్కొన్నారు. వీటి కొనసాగింపు ఒక లయలో సాగితేనే జీవవైవిధ్యం వర్ధిల్లి మనుషులుగా మనకు మనుగడ ఉంటుందని అన్నారు. ఈ భూమి కేవలం మనుషులకే కాదు, సకల జీవరాశులకు ఆలవాలమనే విషయాన్ని మరవరాదని తెలిపారు.

వన్యప్రాణుల సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందకుసాగుతున్నదని మంత్రి తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టాన్ని నిబద్ధతతో అమలు చేయడంతో పాటు, వన్యప్రాణుల వేట, జంతువుల అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి “క్యాచ్ ది ట్రాప్” పేరుతో తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేస్తున్నదన్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన వలలు, ఉచ్చులు, విద్యుత్ తీగలను నిర్వీర్యం చేసి పెద్ద సంఖ్యలో వన్యప్రాణులను అటవీశాఖ కాపాడగలిగిందని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో నిబద్ధతతో కార్యక్రమాలు అమలు చేస్తూనే అరుదైన వన్యప్రాణులైన పులుల సంరక్షణకు కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed