Pm modi: కొత్త క్రిమినల్ చట్టాలతో సత్వర న్యాయం.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
Pm modi: కొత్త క్రిమినల్ చట్టాలతో సత్వర న్యాయం.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ (Naredra modi) కొనియాడారు. బ్రిటీష్ వలస రాజ్యాల కాలంలో రూపొందించిన పాత క్రిమినల్ చట్టాలు భారతీయులను శిక్షించడానికి, లొంగ దీసుకోవడానికే రూపొందించారని విమర్శించారు. ఈ చట్టాలను ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. చండీగఢ్‌లో 3 కొత్త చట్టాల అమలును మోడీ సమీక్షించారు. ఈ సందర్భంగా వాటిని జాతికి అంకితం చేశారు. భారతీయ న్యాయ సంహిత సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయం అనే ఆదర్శాలతో రూపొందించబడిందని తెలిపారు. న్యాయ సంహిత సమానత్వం, సామరస్యం మరియు సామాజిక న్యాయం యొక్క ఆదర్శాలతో అల్లబడిందన్నారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుధీర్ఘ విచారణ రోజులు ముగిసిపోయాయని తెలిపారు.

పౌరుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రూపొందించిన చట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సకాలంలో న్యాయం అందించడమే న్యాయానికి గీటురాయి అని అన్నారు. చండీగఢ్‌లో వాహన చోరీ కేసులో నిందితుడికి కేవలం రెండు నెలల్లోనే శిక్ష పడిందని గుర్తు చేశారు. అలాగే ఢిల్లీలో ఓ కేసును ప్రస్తావిస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 60 రోజుల్లో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పులు కొత్త చట్టాల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. సాధారణ పౌరుల ప్రయోజనాల కోసం, వారి సమస్యల పరిష్కారానికి అంకితమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మార్పులు రావడం సహజమేనన్నారు. ఈ తీర్పులపై దేశంలో సాధ్యమైనంత ఎక్కువ చర్చ జరగాలని, తద్వారా న్యాయం కోసం తన శక్తి ఎలా పెరిగిందో ప్రతి భారతీయుడికి తెలియాలని కోరారు. ఈ కార్యక్రానికి హోం మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు.

కాగా, భారతీయ శిక్షాస్మృతి (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యా అధినియం (BSA) చట్టాలను కేంద్రం ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. ఇది జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

Advertisement

Next Story