- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తానికి షాక్… కమలానికి కలిసొచ్చిన లక్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆది నుంచి హస్తం పార్టీకి ఆధిపత్యంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది.. ప్రస్తుతం ఆ పార్టీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఇప్పటికే పట్టు కోల్పోగా, తాజాగా లీడర్లు, కేడర్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కమలం గూటికి చేరుతున్నారు. ముఖ్యమైన నాయకులు వెళ్తున్నా కనీసం వారిని బుజ్జగించి సర్ది చెప్పే నాయకత్వం లేకుండా పోయింది. రానున్న రోజుల్లో మరింత మంది వలస వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
శ్రేణుల్లో ఆందోళన
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలోనూ బలంగా ఉండేది. 2014లో అధికారం కోల్పోయాక.. జిల్లాలోనూ రోజు రోజుకూ దాని ప్రాబల్యం తగ్గిపోవడం పార్టీ నాయకత్వాన్ని, శ్రేణులను ఆందోళన కలిగిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. స్థానిక సంస్థల్లో గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతుండడం ప్రస్తుతం ఆ పార్టీని కలవర పరుస్తోంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కీలక నాయకులు వెళ్తున్నా అధినాయకత్వం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.
ఇతర పార్టీల చూపు..
ఇప్పటికే నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న పెంబి జెడ్పీటీసీ టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు. ఆమె కూడా ఇటీవల కమలం గూటికి చేరారు. ఇక మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ రాథోడ్ రమేశ్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సిర్పూర్ (టి) నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పాల్వాయి హరీశ్ బాబు బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. కాగజ్నగర్ ఎస్పీఎం క్రికెట్ మైదానంలో శివాజీ సంకల్ప సభను నిర్వహించి.. పెద్ద ఎత్తున తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బీజేపీలో చేరారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు, కీలక నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
సరైన నాయకత్వం లేకపోవడమే కారణమా..!
కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. వారిని నడిపించే నాయకత్వం సరిగా లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం, అందరినీ సమన్వయం చేసే పరిస్థితి లేకపోవడంతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొక్కిరాల ప్రేం సాగర్ రావు, సి.రాంచంద్రారెడ్డి లాంటి నాయకులు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడంతో జిల్లాలో కేడర్ ను నడిపించే వారే కరువయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే పరిస్థితి లేకపోగా.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్, ఒ ఇన్చార్జి పార్టీ వీడగా.. మరో కీలక నేత పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన ప్రభావం రెండు నియోజకవర్గాల్లో చూపనుంది.
జిల్లాల్లోనూ గ్రూపు రాజకీయం
రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ పార్టీ రెండు, మూడు గ్రూపులుగా చీలిపోయింది. ఇటీవల రైతు భరోసా యాత్ర ఉమ్మడి జిల్లాలో నిర్వహించగా.. వర్గ విభేదాలు బయట పడ్డాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పర్యటించగా.. నిర్మల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధి, మాజీ డీసీసీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉండగా.. అసలు భట్టి విక్రమార్క పర్యటన ఎందుకని.. రావొద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారని పార్టీలో చర్చ సాగుతోంది. నిర్మల్ జిల్లాకు చెందిన ముఖ్యులు, డీసీసీ నాయకత్వం వెళ్లకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. జిల్లాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి వర్గాలుగా నాయకులు చీలిపోగా.. అసలు కేడర్ను సమన్వయం చేసే వారే లేరు. పార్టీని వీడుతున్న వారిని బుజ్జగించి.. సర్ది చెప్పే వారు లేకుండా పోయారనే ఆరోపణలున్నాయి.