పోలీసులపై కాంగ్రెస్ కన్నెర్ర చేసిందా!

by Shyam |   ( Updated:2020-06-12 09:54:24.0  )
పోలీసులపై కాంగ్రెస్ కన్నెర్ర చేసిందా!
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తనపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని పదేపదే ఆరోపణలు చేస్తోంది. గురువారం సీఎంను కలిసేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేసిన అంశంపై సీఎల్పీ నేత భట్టీ ఆగ్రహించారు. పోలీసులకు వచ్చిన ఆదేశాలను అర్థం చేసుకోవడంలో వెనకబడుతున్నారని ఆరోపించారు. తాజాగా శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్‌ పట్ల పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న నేతలను అరెస్ట్‌ చేయడం సరికాదని, ప్రజాప్రతినిధుల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని, పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే పార్లమెంట్‌లో, అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు శనివారం కాంగ్రెస్‌ బృందం వెళ్తుందని, పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

హైకోర్టులో రేవంత్ పిటిషన్:

డ్రోన్‌తో చిత్రీకరణ ఆరోపణల విషయంలో పోలీసులపై ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాం ప్రసాదరావు, నార్సింగి ఇన్స్ పెక్టర్ గంగాధర్‌ను చేరుస్తూ న్యాయస్థానంలో శుక్రవారం పిటిషన్ వేశారు. గతంలో డ్రోన్ చిత్రీకరణ ఆరోపణలపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయంలో 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏడేండ్లలోపు శిక్ష ఉండే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాతే అవసరమైతే అరెస్ట్ చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారని పేర్కొన్నారు. డ్రోన్‌తో చిత్రీకరించారనే ఆరోపణలతో నార్సింగి పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైనట్టు తెలియగానే 41ఏ నోటీసు ఇస్తే స్వయంగా వెళ్లి వివరణ ఇస్తానని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తనను జైలుకు పంపించాలనే ఉద్ధేశ్యంతోనే తనకు సంబందం లేని కేసులను కూడా రిమాండ్ నివేదికల్లో ప్రస్తావించారన్నారు. సుప్రీం తీర్పును ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రేవంత్ హైకోర్టును కోరారు.

Advertisement

Next Story