నేడు ఆర్మూర్‌లో రేవంత్ రెడ్డి దీక్ష

by Anukaran |
నేడు ఆర్మూర్‌లో రేవంత్ రెడ్డి దీక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘పసుపు’ రాజకీయం స్థాయికి చేరింది. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర విషయమై రైతులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రాజకీయ పార్టీలకు అతీతంగా గతంలో ఎన్నో పోరాటాలు జరిగిన విషయం విదితమే. కానీ, తొలిసారి రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నడుంభిగించింది. శనివారం ఆర్మూర్ లో ఒక్క రోజు రైతు దీక్ష చేయాలని నిర్ణయించింది. వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీలన్నీ దీక్షపైనే ఫోకస్​పెట్టాయి.

నాయకత్వ లేమి సమస్యతో ఈ నెల 9న ఆర్మూర్ మామిడిపల్లి వద్ద జరిగిన రైతుల నిరసన అట్టర్ ప్లాప్ అయింది. గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు ప్రతినిధులతో ముఖాముఖి చర్చలకు ఎంపీ అర్వింద్ చౌట్ పల్లికి వెళ్లకు ముందే టీఆర్ఎస్ నాయకులు ప్రెస్​మీట్ పెట్టి ఎంపీ రాజీనామా చేయాల్సిందేనని దుమ్మెత్తి పోశారు. ఎంపీతో జరిగిన చర్చలను కాస్త పక్కదోవ పట్టించి అర్వింద్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం వెనుక రైతుల కన్నా రాజకీయమే ఎక్కువైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సారీ కాంగ్రెస్ పార్టీ పసుపు బోర్డు ఏర్పాటు, మద్ధతు ధరపై ఏకంగా ఒక్క రోజు దీక్ష చేపట్టనుండడంతో అధికార టీఆర్ఎస్ తో పాటు, బీజేపీ నాయకులు రేవంత్​ రెడ్డి పర్యటనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు.

పునర్​వైభవం కోసమేనా..!

నేడు జరిగే రైతు దీక్షకు రైతులు వస్తారా.. లేక జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం కోసమే పసుపు బోర్డు, మద్దతు ధర నినాదాన్ని ఎత్తుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఆర్మూర్ లో జరిగే రైతు దీక్షకు అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ, ప్రతిపక్ష బీజేపీ సానుభూతిపరులెవరూ హాజరుకాకుండా చూడాలని ఆయా పార్టీల నేతలు తమ కేడర్​కు ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ సైతం రైతు దీక్ష వేదికగా జిల్లాలో సత్తా చాటాలని చూస్తోంది. జిల్లాలో ఇటీవల ఆ పార్టీ నుంచే ఎక్కువ మంది ఇతర పార్టీలకు వలసలు జరిగాయని, శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు ఈ ‘పసుపు’ డిమాండ్​ను కాంగ్రెస్ తలకు ఎత్తుకుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీపీసీసీ నాయకత్వ మార్పిడి నిలిచిపోవడానికి, జిల్లాలో కాంగ్రెస్ తరుపున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ఆశించేవారు, రేవంత్​రెడ్డి అనుచరులుగా చెప్పుకున్నవారే ఈ దీక్షను చేపట్టారనే మరోపక్క ఆరోపణలున్నాయి.

ఆ రెండు పార్టీలను దూరం చేసేందుకే..

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్​లో రైతులు అన్నిరకాలుగా బలంగా ఉండగా, ఆ ప్రభావం పక్కన ఉన్న బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజవర్గాల్లో తీవ్రంగా ఉంటుంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కల్వకుంట్ల కవిత, ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్​పసుపు బోర్డున తేలేక, మద్దుతు ధర ఇప్పించలేక మోసం చేశారని టీఆర్​ఎస్​ను, బీజేపీలతోపాటు రైతులను ఆయా రెండు పార్టీలకు వ్యతిరేకంగా తయారు చేయడం కోసమే కాంగ్రె దీక్ష చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసినా ఉన్నా పరోక్షంగా బీజేపీకి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎంపీగా గెలిచిన అర్వింద్​పసుపు బోర్డు తేలేడని, కనీసం మద్దతు ధర ఇప్పించలేదు కాబట్టి పదవికి రాజీనామా చేయాలని రైతులతో పాటు కాంగ్రెస్ నేతలు డిమాండ్​చేస్తూనే ఉన్నారు. జిల్లాలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ రైతు దీక్షతో కర్షకులకు దగ్గరయ్యేందుకు రాజకీయంగా తోడ్పతుందని ఆ పార్టీ నేతలు బావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి రైతు దీక్షను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Advertisement

Next Story