సీఎం కేసీఆర్ ​సురభి నాటక కర్త :రేవంత్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-02-17 02:11:09.0  )
సీఎం కేసీఆర్ ​సురభి నాటక కర్త :రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని కాంగ్రెస్ ​పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర చట్టాలకు అనుకూలంగా సాగు విధానం అంటూ సీఎం కేసీఆర్​ చెబుతున్నారని, సురభి నాటకాల మాదిరిగా ఆయన నాటకాలాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఉత్తమ నాటక కర్త అవార్డు ఇవ్వవచ్చన్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద రైతుకు నయా పైసా రావడం లేదని పేర్కొన్నారు. పంట రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకర్లు సొమ్ము ఇవ్వలేదన్నారు. దీంతో రైతుబంధు సొమ్మును మొత్తం బ్యాంకుల వడ్డీ కింద జమ చేసుకున్నాయన్నారు.

బుధవారం గాంధీభనవ్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో వెల్లడైన అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్ నియంతృత వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి ఫెయిల్ అయ్యాడని రేవంత్​రెడ్డి విమర్శించారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కొత్తగా వ్యవసాయం నేర్పుతున్నట్లు సీఎం చేస్తున్నాడని.. ఇది తాతకు దగ్గులు నేర్పుతున్నట్లుగా ఉందన్నారు. రైతు బీమా అనేది లాభం లేని పథకమని, 60 ఏళ్లు దాటితే వర్తించడం లేదన్నారు. పంటలు వేసి దిగుబడి రాక నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుభీమా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. బతికి ఉన్నప్పుడు రూపాయి సాయం చేయని ప్రభుత్వం.. రైతు ఆత్మహత్య చేసుకుంటే సాయం చేస్తామనడం ఘోరమన్నారు. రైతులంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తన పాదయాత్రలో వెల్లడైందన్నారు.

కాంగ్రెస్ నినాదం జై కిసాన్… జై జవాన్​

రైతుల కోసం కాంగ్రెస్​ పార్టీ తరుపున పోరాటం చేస్తానని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రకటించారు. రైతుల కోసం ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ నినాదం జై కిసాన్.. జై జవాన్​ అని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల భూములు గుంజుకుంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. యాచారం ఫార్మాసిటీ కోసం రైతుల భూములు 20 వేల ఎకరాలు గుంజుకుని, రూ. 16 లక్షలకు ఎకరం చొప్పున కొని రూ. కోటి చొప్పున అమ్ముకుంటున్నారని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. యాచారం ఫార్మాసిటీ నిర్వాతులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే అకాంక్ష ఉంటే ఆ ప్రాంతాల్లో రైతుల భూములకు సరైన పరిహారం అందించాలన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం త్యాగాలు చేయాలని సీఎం కేసీఆర్​ చెప్పుతుంటారని, ముందు ఫాంహౌస్​ నుంచి త్యాగం మొదలు కావాలన్నారు. కానీ పల్లి బఠానీలకు గుంజుకుని కోట్లు సంపాదించుకోవడం నేరపూరిత రాజకీయమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తుతానని తెలిపారు.

ఇక రాష్ట్రంలో ఆసరా పింఛన్లను అర్హులకు ఇవ్వడం లేదని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడంతో మరొకరు పస్తులుండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏళ్ల నుంచి పింఛన్లకు దరఖాస్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని, ఒకరు చస్తే ఇంకొక్కరికి ఇస్తామనే తీరుతో ఉన్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్​ చేశారు.

గిరిజనులకు భూమి ఇస్తామని మోసం చేస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కొంతమంది గిరిజనుల భూములను టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులను లొంగదీసుకుని ఎమ్మెల్యేల బినామీల పేరుతో పట్టా మార్పించుకున్నారని విమర్శించారు గిరిజనులకు పట్టాలిస్తే వాటిని రద్దు చేయించుకుని టీఆర్ఎస్ నేతలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల దగ్గర గుంజుకున్న భూములపై పక్కా ప్రణాళికతో ఉద్యమం చేస్తామని, కబ్జాదారుల భరతం పడుతామన్నారు.

Advertisement

Next Story