జల దోపిడిపై చిత్తశుద్ధి ఉందా?వంశీ చంద్‌రెడ్డి

by Shyam |
జల దోపిడిపై చిత్తశుద్ధి ఉందా?వంశీ చంద్‌రెడ్డి
X

దిశ, న్యూస్ బ్యూరో: ఏపీ ప్రభుత్వ జలదోపిడిపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సీఎంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఉందని, కానీ ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే తెలంగాణ గడ్డపై ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకపోగా, రాయలసీమ గడ్డపై చేసిన రాయలసీమను రతనాలసీమ చేస్తా అనే హామీని నెరవేర్చడానికి మాత్రం కంకణబద్ధులై ఉన్నట్లున్నారని లేఖలో విమర్శించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక సందేహాలను తావిస్తుందన్నారు. ఆగస్టు 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేసుకున్నారని, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారయ్యే ఆగస్ట్ 19వ తరువాతే సమావేశానికి హాజరయ్యే వెసులుబాటు సాధ్యమవుతుందని అనడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యం అనే విధంగా సీఎం వ్యహరిస్తున్నారని వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ జలదోపిడి పై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే భావనతో, ఈ అంశంపై టీఆర్ఎస్ నాయకులకు బహిరంగ చర్చకు రావాలని. దీనిపై ఇప్పటికే సవాల్ చేసినా ఇంతవరకు ఎవరూ స్పందించక పోవడం అనేక అనుమాలకు బలం చేకూర్చుతుందన్నారు.

ఏపీ జల దోపిడి అంశంపై ఈ నెల 12న ఉదయం 11 గంటలకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్బుకు మిమ్మల్ని బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వం తరపున ప్రతినిధిని చర్చకు పంపి, మన రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో అంతా అనుమానిస్తున్నట్లుగా తెలంగాణ సీఎంగా కాకుండా కాంట్రాక్టర్ల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే అనుమానాన్ని నిజమని రుజువు చేసుకున్నట్లు భావిస్తామని లేఖలో వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశంగానే ఈ సవాల్‌ను స్వీకరించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed