మల్లారెడ్డిని చూస్తుంటే.. ‘గురిగింజ’ సామెత గుర్తుకు వస్తోంది: కాంగ్రెస్ నేత

by Shyam |   ( Updated:2021-09-20 07:08:50.0  )
minister mallareddy
X

దిశ, మేడిపల్లి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు చూసి మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి అనవసరంగా వ్యాఖ్యలు చేసి కేసీఆర్ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం నాడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి తన స్థాయిని మించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారన్నారు.

మంత్రి మల్లారెడ్డి చేసినట్లుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిండో నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలకు వస్తున్న జనాలను చూసి టీఆర్ఎస్ పార్టీ నేతలకు మతి భ్రమించి పోతోందని అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి మల్లారెడ్డి మాటలు చూస్తుంటే గురిగింజ సామెత గుర్తుకు వస్తుందని గురిగింజ తన కింద నలుపు చూసుకోనట్లుగా ఉందన్నారు. అంతేకాకుండా మల్లారెడ్డి టీడీపీ పార్టీలో ఎంపీ పదవి, టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఎలా సంపాదించుకున్నారో ఆయన పార్టీ నేతలను అడిగితే తెలుస్తుందని అన్నారు.

నీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సరిదిద్దడం మానుకొని కాంగ్రెస్ పార్టీపై, నేతలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో ప్రజలకు అర్దం అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ప్రజా క్షేత్రంలో మాట్లాడే ముందు హుందాగా వ్యవహరించాలని, లేని పక్షంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. తాము విమర్శలు చేయాలంటే మాకు మా నాయకుడు నేర్పిన సంస్కారం అడ్డోస్తుందని అందుకే హుందాగా మాట్లాడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా మల్లారెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని సూచించారు.

Advertisement

Next Story