‘ఈటల’ మంచోడే.. ఎన్నికల వేళ బాంబ్ పేల్చిన కాంగ్రెస్ నేత వీహెచ్

by Anukaran |   ( Updated:2021-10-22 03:29:52.0  )
‘ఈటల’ మంచోడే.. ఎన్నికల వేళ బాంబ్ పేల్చిన కాంగ్రెస్ నేత వీహెచ్
X

దిశ, హుజురాబాద్ : దేశం అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు సామాన్యుడిపై భారం మోపే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. సీఎంగా మోడీ ఉన్నప్పుడు ప్రధాని కావాలన్న కాంక్షను అంబానీ, అదానీలతో వెలిబుచ్చాడన్నారు.

దీంతో పహిలే పాంచ్ సాల్ మేరా.. బాద్ మే పాంచ్ సాల్ తేరా.. అని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ధరల నియంత్రణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరలకు బీజేపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలకు పోలిక లేకుండా పోయిందన్నారు. అప్పటికి ఇప్పటికీ ధరలు రెట్టింపు అయ్యాయని విమర్శించారు.

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మంచోడే.. కానీ, ఆ పార్టీలో చేరడం మాత్రం మంచి నిర్ణయం కాదన్నారు. ఉద్యమ సమయంలో మంచి పని చేసిన ఈటల.. బీజేపీ పార్టీని ఎంచుకోవడమే తప్పు అని అన్నారు. ధరలు తగ్గించేందుకు బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తారా అని వీహెచ్ ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని వద్దని కాంగ్రెస్ పార్టీ అనలేదని అన్నారు. ఆ పాపం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలదే అని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story