కేసీఆర్‌కు కొత్త ట్విస్టు.. అదిరిపోయే షాకిచ్చిన కాంగ్రెస్, బీజేపీ

by Anukaran |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన దళిత బంధు పథకానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి. రాష్ట్రమంతటా దశలవారీగా అమలుచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ, హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా అక్కడ నిలుపుదల చేయడంతో దీన్ని కంటిన్యూ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి.

సెంటర్ ఫర్ దళిత స్టడీస్ చీఫ్ మల్లేపల్లి లక్ష్మయ్య ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ తరఫున బక్క జడ్సన్ కూడా ఇంకో పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజాగా బీజేపీ తరఫున డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కూడా ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదంటూ కాంగ్రెస్, బీజేపీలు క్లారిటీ ఇచ్చాయి.

దళిత బంధుపై కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మూడు పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. మీరంటే మీరే కారణమంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ బురదను వదిలించుకోడానికి ఇప్పుడు ఆ పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదంటూ సంజాయిషీ ఇచ్చుకుంటున్నాయి. హైకోర్టు వరకూ వెళ్ళి ఆ పథకాన్ని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకాన్ని అమలుచేయడంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున అధికార టీఆర్ఎస్ పార్టీనే లోపాయకారీగా వ్యవహరించి ఎన్నికల సంఘం ద్వారా స్టే ఉత్తర్వులు తెప్పించుకున్నదని రెండు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ నేతలు బీజేపీపైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసినందువల్లనే స్టే ఆర్టర్ వచ్చిందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎవరి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నదనే సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీని మరొకటి విమర్శించుకుంటున్నాయి. ఈ మచ్చను వదిలించుకోడానికి ఇప్పుడు పార్టీలు హైకోర్టు బాట పట్టాయి. దళితబంధు నిలుపుదల పాపం తమది కాదని చెప్పుకుంటున్నాయి. ఆ పథకాన్ని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఈ పిటిషన్లపై నేడో రేపో విచారణ జరగనున్నది.

Advertisement

Next Story