హైదరాబాద్ లో అదెప్పుడో తెలవదు!

by Shyam |
హైదరాబాద్ లో అదెప్పుడో తెలవదు!
X

దిశ, హైదరాబాద్: చుట్టుమిట్టిన కష్టకాలం.. మేమున్నామంటూ అక్కడి నుంచి అందిన భరోసా.. అందుకు అనుగుణంగా మెల్లమెల్లగా పడుతున్న అడుగులు. కానీ, ఇక్కడేమో ఆలస్యం. ఇదేంటని అడిగితే విషయమది అని చెబుతున్న వైనం. దీంతో అదెలాగోనని వాళ్లంతా ఆగమాగం. అదేంటో ప్రత్యేక కథనంలో..

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సామాన్యులు, పేదల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రకటించిన రేషన్ పంపిణీపై అధికారుల్లో అయోమయం నెలకొంది. కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన లబ్దిదారులకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500లను అందజే- స్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)కు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఆధార్ కార్డు ఇప్పటికే అనుసంధానమైన ఉన్నాయి. అయితే, సబ్సిడీ గ్యాస్ కు లింకైన బ్యాంకు అకౌంట్ లో రూ1500 లను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో బియ్యం పంపిణీ పట్ల ఆయా అధికారులు ఇప్పటికే స్పష్టత ఇవ్వగా.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఇంకా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఇటు లబ్దిదారుల్లోనూ, అటు రేషన్ డీలర్లలోనూ అయోమయం నెలకొంది.

సమకూరని బియ్యం..

హైదరాబాద్ జిల్లాలోని 9 సర్కిళ్ల వారీగా దాదాపుగా 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే, సరిపడా బియ్యం సమకూరకపోవడం వల్ల శుక్రవారం చేయాల్సిన పంపిణీ చేయలేకపోతున్నట్టు హైదరాబాద్ సీఆర్వో బాలమాయదేవి గురువారం ప్రతికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంకా బియ్యం సేకరణ దశలో ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. సేకరించిన బియ్యం దుకాణాలకు, పంపిణీ కేంద్రాలకు చేరేందుకు మరికొంత సమయం పడుతోందని అన్నారు. కాకుంటే, జిల్లాలోని 674 రేషన్ దుకాణాలతో పాటు అధికారులు గుర్తించిన 18 కేంద్రాలను బియ్యం పంపిణీకి గుర్తిస్తున్నట్టు తెలిపారు. బియ్యం సరఫరా తేదీ ఖరారు కాగానే తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు.

అయోమయంలో డీలర్లు…

హైదరాబాద్ జిల్లా పరిధిలో అంబర్ పేట, బేగంపేట్, చార్మినార్, ఖైరతాబాద్, మలక్ పేట, మెహిదీపట్నం, నాంపల్లి, సికింద్రాబాద్, యాకత్ పురా సర్కిళ్ళు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 674 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.80 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ద్వారా ప్రతినెలా బియ్యం, పప్పు, పంచదార సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా యావత్తు దేశమే లాక్ డౌన్ కావడంతో ప్రభుత్వం పేద ప్రజలకు ఆదుకోవడానికి బియ్యం పంపిణీతో పాటు నిత్యావసరాలను కొనుగోలు నిమిత్తం రూ.1500లను అందజేస్తానని చెప్పింది. అయితే, ఈ కార్డుదారులందరికీ సుమారు 26 వేల మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ బియ్యం పంపిణీ ఎప్పట్నుంచి ఉంటుంది. కూపన్లు ఎప్పట్నుంచి అందజేస్తారనే విషయాలపై డీలర్లకు అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన సూచనలు రాకపోవడంతో డీలర్లు అయోమయానికి గురవుతున్నారు.

Tags : Corona Effect, Civil Supply, Rice Distribution, Civil Supply CRV

Advertisement

Next Story

Most Viewed