టీఎంయూలో ‘పెత్తనం’ రగడ

by Shyam |
టీఎంయూలో ‘పెత్తనం’ రగడ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మజ్దూరు యూనియన్​ (టీఎంయూ) వివాదాల్లోకి వచ్చింది. సమ్మె టైంలో జేఏసీ నేతగా వ్యవహరించిన టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనపై ఆర్టీసీ యాజమాన్యంతో ఒత్తిళ్లు తెస్తూనే ఉన్నారు. ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ సమయంలో యూనియన్​ వివాదం మళ్లీ బయటకు వచ్చింది. టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనంటూ చెప్పుకొచ్చిన థామస్​రెడ్డి.. అశ్వత్థామరెడ్డిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అసలైన టీఎంయూ మాదేనని, కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నామని, థామస్​రెడ్డిని ఎప్పుడో బహిష్కరించామని, సమ్మె తర్వాత రాజీనామా చేశాడని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

గౌరవాధ్యక్ష స్థానంలో ఎవరూ లేరు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలోనే యూనియన్లన్నీ రద్దు చేసినట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిరోజుల పాటు ఆర్టీసీలో యూనియన్ల అంశమే లేదు. టీఎంయూలో కీలకంగా ఉన్న అశ్వత్థామరెడ్డి, థామస్​రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. టీఎంయూ తమదంటే తమదేననంటూ రచ్చకెక్కారు. థామస్​రెడ్డి ఏనాడో రాజీనామా చేశాడని, సభ్యుడిగా యూనియన్​ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతుంటూ బహిష్కరించామని అశ్వత్థామరెడ్డి చెప్పుతుంటే… అసలు అశ్వత్థామరెడ్డినే తొలగించామని థామస్​రెడ్డి ఆరోపణలకు దిగారు. దీంతో గతనెల 31న టీఎంయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అశ్వత్థామరెడ్డి నిర్వహించారు. కానీ అంతకు ముందు కూడా థామస్​రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా ఒకే యూనియన్​లో రెండు వర్గాలు విభేదాలకెక్కాయి.

ఇదే సమయంలో టీఎంయూ గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను ఎన్నుకునేందుకు థామస్​రెడ్డి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ యూనియన్​కు గతంలో గౌరవాధ్యక్షుడిగా మంత్రి హరీష్​రావు ఉన్నారు. కానీ యూనియన్ల రద్దు తర్వాత మళ్లీ జీవం పోసుకోలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను ఎన్నుకుంటామని లీక్​ చేశారు. కానీ అశ్వత్థామరెడ్డి వర్గం మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. యూనియన్​కు గౌరవాధ్యక్ష స్థానం ఎవరికీ లేదని చెప్పుతున్నారు. అంతేకాకుండా ఈ నెల 7న కేంద్ర సంఘం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. టీఎంయూలో అసలైన వర్గం తమదేనని, ఈనెల 7న ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రచారం కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీలో వేతనాల వ్యవహారం చర్చగా మారింది. వేతనాలు పెంచేందుకు అవకాశాలు పరిశీలించాలని సీఎం కేసీఆర్​ చెప్తే…అధికారులు మాత్రం సాధ్యం కాదని నివేదించారు. ప్రస్తుతం ఆర్టీసీ అష్టకష్టాల్లో కూరుకుపోతోంది. ఒక్కోనెల వేతనాల కోసమే ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అత్యవసరంగా 1300 బస్సులు కొనాల్సి ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం చేతిలో చిల్లిగవ్వ లేదు. సీసీఎస్​ నిధులనే జమ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ సమయంలో వేతనాలు పెంపు సాహాసోపేతమేనంటున్నారు. కానీ దీనిపై టీఎంయూ అశ్వత్థామరెడ్డి వర్గం మాత్రం అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది. ఈనెల 7న కేంద్ర కమిటీ ఎన్నికల తర్వాత ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed