కౌన్సిలర్, ట్రాఫిక్ సీఐ మధ్య వాగ్వాదం.. కోపంలో బూతులు తిడుతూ..

by Shyam |   ( Updated:2021-09-04 06:13:20.0  )
కౌన్సిలర్, ట్రాఫిక్ సీఐ మధ్య వాగ్వాదం.. కోపంలో బూతులు తిడుతూ..
X

దిశ, రాజేంద్రనగర్ : వీధి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తూ, తోపుడుబండ్లను తీసుకొచ్చి స్టేషన్‌లో పెట్టారనే సమాచారం అందగానే శంషాబాద్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్, అతని అనుచరులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయమై ఇన్స్‌పెక్టర్ రామకృష్ణను అడగగా.. నువ్వు ఎవరు నన్ను అడగడానికి అంటూ బూతులు తిట్టాడని కౌన్సిలర్ సంజయ్ ఆరోపించారు.

ప్రజల సమస్యలపై అడగడానికి వెళితే ఓ ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా బూతులు తిడుతూ.. బయటకు వెళ్లూ అంటూ తనపై పోలీసు అధికారి చిందులేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ శంషాబాద్ ఏసీపీ భాస్కర్ వేములకు కౌన్సిలర్ సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు.

ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే వీధి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తూ వారి పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ఓ ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్లు బూతులు తిడుతూ, సెల్ ఫోన్ లాక్కొని తన చాంబర్ నుంచి బయటకు వెళ్లాలని.. మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టకుండా వాహనదారుల ఫోటోలు కొడుతూ.. వారికి చలాన్లు విధించడం కరెక్ట్ కాదన్నారు.

ట్రాఫిక్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. రోడ్డు పక్కన ఉన్న తోపుడుబండ్ల వాళ్లకు గతంలోనే నోటీసులు జారీ చేశామని అన్నారు. వారు నోటీసులను పట్టించుకోలేదని తెలిపారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందనే కారణంతోనే శనివారం ఉదయం బండ్లను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టామని వారిపై కేసు కూడా నమోదు చేశామన్నారు.

వ్యాపారులకు మద్దతుగా వచ్చిన కౌన్సిలర్.. బండ్లను ఎందుకు తీసుకు వచ్చారని అడిగారు. వారి వలన ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని చెప్పినా వినకుండా, శంషాబాద్‌లో మీకు ఇష్టమున్నట్టు ఫోటోలు తీస్తున్నారని చిందులేశారు. నేను ఎవరిని ఎలాంటి బూతులు తిట్టలేదని తెలిపారు. కౌన్సిలర్.. తన విధులకు ఆటంకం కలిగించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story