ఆల్ పాస్ పై సస్పెన్స్.. ఆందోళనలో విద్యార్థులు

by Shyam |   ( Updated:2021-12-22 23:38:00.0  )
intermediate students
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ విద్యార్థి సంఘాల ఆందోళనలు మిన్నంటుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడటం లేదు. ఇంతమంది ఫెయిల్ కావడానికి కారణాలు.. ఇతర రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులపై ఇంటర్ బోర్డు నుంచి సమగ్ర నివేదిక తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ఇంతకూ ఫెయిలైన విద్యార్థులను పాస్ చేస్తారా? అందరూ వచ్చే ఏడాది సెకండ్ ఇయర్‌తో కలిపి పరీక్షలు రాయాల్సి ఉంటుందా? అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

ఆప్షనల్ సబ్జెక్టుల్లోనే..

ఇంటర్​ఫలితాల్లో 4,59,242 విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో పాసైంది 2,24,012 విద్యార్థులే. 2,35,230 మంది ఫెయిలయ్యారు. లాంగ్వేజెస్​లో అంతంతమాత్రం పాసైనా ఎక్కువ శాతం ఫెయిలైంది ఆప్షనల్​సబ్జెక్టుల్లోనే! కరోనా కారణంగా నామమాత్రంగానే పరీక్షలు ఉంటాయని దాదాపుగా అందరూ పాసవుతారనే ప్రచారం జరుగడం, కాలేజీల యాజమాన్యాలు కూడా ఇలాంటి సంకేతాలే ఇవ్వడంలో విద్యార్థులు పరీక్షలను లైట్ తీసుకున్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీల్లో పాసైనా ఆప్షనల్ సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది గట్టెక్కలేక పోయారని సమాచారం. ఈ సబ్జెక్టుల్లో ప్రభుత్వం బార్డర్​మార్కులు వేసినా పాసయ్యే వారి సంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్​బోర్డు విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో అనుమానాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​చేయించుకోవాన్న సూచించిన విషయం తెలిసిందే. ఇందు కోసం 50 శాతం ఫీజు కూడా బోర్డు తగ్గించింది. బుధవారం వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. రీ వెరిఫికేషన్​కు 31,837 దరఖాస్తులు, రీకౌంటింగ్​కు 3,489 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువ శాతం మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుందామనుకున్నా సర్వర్ డౌన్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. గడువు పెంపుపై కాగా బోర్డు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

బార్డర్ మార్కులతో పాస్ సాధ్యమా?

నిజానికి ఇంటర్ ఫస్టియర్​ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్డును తికమకపెడుతున్నాయి. మొత్తం నాలుగున్నర లక్షల మంది పరీక్షలు రాయగా, 2 లక్షల 24 వేల మంది పాసయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ లోనే అత్యధికంగా లక్షా 15 వేల మంది 75 శాతం మార్కులతో పాసయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక విద్యార్థులకు హయ్యెస్ట్ మార్కులు సైతం ఈ ఫలితాల్లోనే రావడం గమనార్హం. 70 నుంచి 50 శాతం సిలబస్ ను అర్థం చేసుకున్న విద్యార్థులు ఫుల్ స్కోర్​చేశారు. ఫెయిలైన విద్యార్థులకు బార్డర్​మార్కులు వేసి పాస్ చేయాలని చూసినా ఆ ప్రతిపాదన వర్కవుట్ కానీ పరిస్థితి ఉందని సమాచారం. అలా పాస్​చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కొద్దిమంది విద్యార్థులకే లబ్ధి చేకూరే అవకాశం ఉందని టాక్.

మరోవైపు ఇంటర్​విద్యార్థుల ఆల్ పాస్ నిర్ణయాన్ని సర్కార్ పెండింగ్ లో పెట్టడంతో మరో విద్యార్థి మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నందిని అనే విద్యార్థిని పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఎఫ్ఐ నాయకులు బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశాయి. తాజాగా కాంగ్రెస్​ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తక్షణం సీఎం కేసీఆర్ విద్యార్థులను పాస్ చేయాలని, లేదంటే తానొక్కడినే వచ్చి ఇంటర్ బోర్డు ఎదుట గురువారం దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Advertisement

Next Story