‘వరంగల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’

by Shyam |
‘వరంగల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’
X

దిశ, హైదరాబాద్: వరంగల్ శివారు పారిశ్రామిక ప్రాంతంలోని పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు బయటపడిన ఘటనలో నిజ నిజాలను నిగ్గుతేల్చేందుకు సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరణించిన వలస కూలీలవి హత్యలా..? ఆత్మహత్యలా అనే విషయాన్నితేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బతుకుదెరువు కోసం కుటుంబాలతో సహా వలస వచ్చి అర్థంతరంగా ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి అత్యంత విచారకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్.. లక్షలాది వలస కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసి, దయనీయమైన పరిస్థితిలోకి నెట్టివేసిందన్నారు. వలస కార్మికులు ఎక్కడ నుంచి వచ్చినా వారిని ఈ దేశ పౌరులుగా గుర్తించాలన్నారు. అలా గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. వారికి సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని అన్నారు. వరంగల్ ఘటన మరణాలు.. హత్యలుగా తేలితే నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆత్మహత్యలుగా తేలితే ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని మంద కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed