సర్కారు ఆశయానికి రియల్టర్ల తూట్లు.. జోరుగా దందా

by Shyam |   ( Updated:2021-03-21 22:01:12.0  )
సర్కారు ఆశయానికి రియల్టర్ల తూట్లు.. జోరుగా దందా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: లే అవుట్ పర్మిట్ తీసుకోకుండానే రియల్టర్లు దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిభందనలు తప్పించుకునేందుకు వ్యవసాయ భూమి పేరిట క్రయవిక్రయాలు జరిపి సామాన్యులను నిలువుదోపిడీ చేస్తున్నారు. దీంతో కరీంనగర్ సమీపంలో రియాల్టర్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగుతున్నది. ఓ వైపు శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) నోటీసులు జారీ చేస్తున్నా రియాల్టర్లు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు.

వ్యవసాయ భూమిపేరిట..

కరీంనగర్ సుడా పరిధిలోని కొన్ని గ్రామాల్లో రియాల్టర్లు సరికొత్త రితీలో వ్యాపారం సాగిస్తున్నారు. కమర్షియల్ భూములుగా అమ్మకాలు జరిపితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్ మెంట్ (నాలా) ద్వారా వ్యవసాయ భూములను కన్వర్షన్ చేసి లే అవుట్ నిబంధనల ప్రకారం భూమిని రోడ్లు, కమ్యూనిటీ అవసరాల కోసం వదిలేసి మిగతా భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాల్సి ఉంటుంది. సుడా పరిధిలోకి రాకముందు అయితే డీటీసీపీ ద్వారా లే అవుట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సుడా ద్వారా ఇవే నిబంధనల ప్రకారం లే అవుట్ వేసి వెంచర్లు చేయాల్సి ఉంది. అయితే కొంత మంది రియాల్టర్లు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయ భూమిగానే చూపిస్తూ లావాదేవీలు చేస్తున్నారు. దీంతో భూములు కొన్న వారు ఎల్ఆర్‌ఎస్ కోసం డబ్బులు చెల్లిస్తేనే ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుంది. లేనట్టయితే సుడా పరిధిలోని పంచాయితీలు, కార్పొరేషన్ ఎలాంటి అనుమతి కూడా ఇవ్వవు. తప్పని పరిస్థితితో ఇంటి నిర్మాణం కోసం ప్లాట్లు కొన్న సామాన్యులు లక్షల్లో జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురు కానుంది..

రియాల్టర్ల ఉచ్చులో సామన్యులు..

రియాల్టర్లు చేస్తున్న తప్పిదాల కారణంగా సామాన్యులు బలి కావల్సిన పరిస్థితి తయారైంది. నిబంధనల ప్రకారం రియాల్టర్లు వ్యాపారం చేస్తే ప్లాట్లు కొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, ఇప్పుడు వీరు చేస్తున్న దందాతో భవిష్యత్తులో సామాన్యులు రూ.లక్షల్లో సుడాకు జరిమానా చెల్లించాల్సి వచ్చే అవకాశాలు లేకపోలేదు. కరీంనగర్ సమీపంలోని మల్కాపూర్, చింతకుంట, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, తిమ్మాపూర్, మానకొండూరు తదితర ప్రాంతాల్లో రియాల్టర్లు ప్లాట్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఇందులో చాలా వరకు ఎల్‌పీ నెంబర్లు లేకుండానే క్రయవిక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీలవ సుడా కూడా ఇలాంటి వెంచర్లను గుర్తించి నోటీసులు కూడా జారీ చేసింది. నిబంధనల ప్రకారం భూ అమ్మకాలు జరపని వెంచర్లపై సుడా కొరడా ఝుళిపించి ప్రాపర్టీని సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాలు తెలియని సామాన్యులు రియాల్టర్ల ఉచ్చులో పడి ప్లాట్లు కొని మోసపోతున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినా రానున్న కాలంలో ఆ భూములు కొన్నవారిపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.

కఠినంగా వ్యవహరిస్తాం: సుడా ఛైర్మన్ జివి

లే అవుట్ పర్మిషన్ తీసుకోకుండా వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రియాల్టర్ల మాయమాటల్లో పడి మోసపోవద్దు. ఎల్‌పీ నెంబర్ లేకుండా వ్యాపారం చేస్తున్న వెంచర్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే కొన్ని వెంచర్లకు నోటీసులు ఇచ్చి వ్యాపారం జరగకుండా అడ్డుకున్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా వ్యవసాయ భూమిగా చూపిస్తూ 2, 3 గుంటలు చేసి అమ్మకాలు జరుపుతున్నారని, వాటికి రిజిస్ట్రేషన్లు చేయకూడదని లేఖలు రాశాం. సామాన్యులపై భారం మోపేలా వ్యవహరిస్తున్న ఎవరినీ వదిలిపెట్టది లేదు.

Advertisement

Next Story