పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

by Aamani |   ( Updated:2021-10-21 06:06:02.0  )
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
X

దిశ, ఆదిలాబాద్: ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రభుత్వ శాఖలలో పోలీస్ శాఖ అత్యంత ప్రధానమైనదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిలుగా..జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీస్ బలగాలు స్మృతి పరేడ్ నిర్వహించి ఈ ఏడాది విధినిర్వహణలో దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వారి నామస్మరణతో కూడిన పుస్తకాన్ని జిల్లా ఎస్పీకి అందజేశారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు, అనంతరం ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబీకులతో కలిసి స్మారకస్థూపంకు పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల శాంతికి ప్రతీకగా కాగడాలు వెలిగించారు. అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరులైన పోలీస్ కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. అమరవీరుల కాలనీలోని సమస్యలను త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న పోలీసులు, సైనికులకు ఏమాత్రం తీసిపోరన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల నిబద్ధత వెలకట్టలేనిదని కొని యాడారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అక్టోబర్ 21 జాతీయ పోలీస్ చరిత్రలో ఎర్రని అక్షరాలతో లిఖించబడిన రోజన్నారు. 62 సంవత్సరాల క్రితం ఈ రోజు భారత సరిహద్దుల్లో పహర కాస్తున్న మన పోలీసు దళాలపై చైనీయులు దాడి చేయడం జరిగిందని గుర్తుచేశారు. 1959వ సంవత్సరంలో భారత్-చైనా సరిహద్దులో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే దినంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 377 మంది పోలీసు అధికారులు, జవాన్లు, విధినిర్వహణలో ప్రాణాలను అర్పించినట్లు తెలిపారు. పోలీసుల నిరంతర అప్రమత్తతతోనే జిల్లాలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని, ప్రజల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్ఫూర్తి, ప్రేరణ, ప్రోత్సాహాన్ని పొందుతున్నామని తెలిపారు. విపత్కర సమయంలో ప్రజలకు భద్రత, పరిరక్షణకు అవసరమైతే ప్రాణదానం చేయడానికి పోలీసులు వెనుకాడరని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ఘటనలో వీరమరణం పొందిన తొమ్మిది మంది పోలీస్ కుటుంబ సభ్యులకు బహుమతులు ప్రధానం చేశారు.

పట్టణంలో పోలీసుల ర్యాలీ..

పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఎన్ సీసీ క్యాండెట్లు, టీఎస్ఎస్పీ పోలీస్ అధికారులు భారీ ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల నుండి కొనసాగుతూ హెడ్ క్వార్టర్ వరకు పూర్తయింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాస రావు, సి. సమయ్ జాన్ రావు, బి. వినోద్ కుమార్, టీఎస్పీఎస్ కమాండెంట్ వేణుగోపాల్, జిల్లా విద్యాధికారి ప్రణీత, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed