ఏఎన్ఎం భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

by Shyam |   ( Updated:2021-09-27 11:48:50.0  )
ఏఎన్ఎం భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
X

దిశ, వనపర్తి: రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందిన ఏఎన్‌ఎం భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హామీ ఇచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆదివారం మధ్యాహ్నం ఏఎన్‌ఎం భాగ్యమ్మ మృతదేహంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, సీపీఎం పార్టీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. పని ఒత్తిడి కారణంగా మరణించిన ఏఎన్ఎం భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, వైద్య ఆరోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలన్నారు. మరణానికి కారణమైన జిల్లా వైద్య శాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ.. మృతి చెందిన ఏఎన్ఎం భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భాగ్యమ్మ కుమారుడిని గురుకులంలో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఏఎన్‌ఎంల డిమాండ్లపై స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ హామీ ఇవ్వడంతో నిరసన తెలుపుతున్న ఏఎన్ఎంలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్, సీపీఎం నాయకులు పుట్ట ఆంజనేయులు, గోపాల కృష్ణ, శ్రీరంగపూర్ జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ మధుసూదన్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed