- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఇలాకాలో ‘డబుల్’ కష్టాలు.. కుంగుతున్న ఇళ్లు, కూలుతున్న గోడలు
దిశ ప్రతినిధి, మెదక్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మూట్రాజపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండి కొద్దిపాటి వర్షాలకే ఇళ్లు కుంగుతున్న, కూలుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమిటని, తాము బతికి బట్టకడతామా.? అన్న ఆందోళన నిర్వాసితుల్లో వ్యక్తం అవుతున్నది. ఆర్ అండ్ ఆర్ కాలనీలో చిన్నపాటి వర్షాలకే వీధులన్నీ బురదామయంగా మారడం, ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి అస్తవ్యస్తంగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కండ్ల మీద కునుకు లేకుండా క్షణక్షణం భయం.. భయంగా కాలం వెల్లదీస్తున్న ముట్రాజ్‌పల్లి పునరావాస కాలనీ దీనావస్థపై దిశ ప్రత్యేక కథనం.
కుంగిపోతున్న ఇల్లు.. కూలిపోతున్న గోడలు..
సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50 టీఎంసీల మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కేటాయించిన సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని మూట్రాజ్‌పల్లి ఆర్ అండ్ ఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ లోపాలు బట్టబయలు అవుతున్నాయి. లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసి ఏడాదైనా గడవక ముందే నాణ్యత లోపంతో తమ ఇండ్లు బీటలు వారడం, కూలిపోవడం, కుంగిపోవడం చూసి భూ నిర్వాసితులు అవాక్కైపోతున్నారు. చిన్నపాటి వర్షానికే ఓ ఇంటి గోడ కూలిపోగా, మరో ఇంట్లో ఇంటి లోపలి ఫ్లోరింగ్ కుంగి పోయింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఏ ఇంట్లో చూసినా స్లాబ్‌ల నుంచి నీరు కారడం చూసి లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన తమకు జీవించడానికి ఏదో ఒక ఇళ్లు ఉందనుకుంటే వచ్చిన రెండు మూడు నెలలకే నాణ్యత లోపంతో బీటలు వారడం, కుంగిపోతుంటే తాము ఎలా బతకాలి అని ఆందోళన చెందుతున్నారు.
అటుగా చూడని అధికారులు..
మల్లన్నసాగర్ ముంపునకు గురవుతున్న సుమారు ఎనిమిది గ్రామాల భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ ముట్రాజ్‌పల్లి తునికి బొల్లారంలో సుమారు నాలుగు వేల పైచిలుకు ఇండ్లు నిర్మించారు. ఇటీవల బలవంతంగా భూ నిర్వాసితులను తమ గ్రామాల్లో నుంచి ఖాళీ చేసి ముట్రాజ్‌పల్లి ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీకి తరలించారు. అయితే, లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసిన సమయంలో అధికారులు వచ్చారంటే ఇప్పటి వరకు అటు వైపు కూడా వెళ్లలేదు. దీనిపై భూ నిర్వాసితులు పలు మార్లు ప్రశ్నించినా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించాలని అధికారులను ఆదేశించినా.. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా కాలనీని సందర్శించలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఇండ్లలో ఉండలేమంటూ ఆవేదన..
వర్షాలకు ఇండ్ల ముందు నీరు నిలవడంతో తమ ఇళ్లు ఎక్కడ కూలిపోతుందోనని భయానికి ఇళ్లు విడిచి బంధువుల ఇంటికి వెళ్లి నిద్రపోవాల్సి వచ్చిందని ఓ లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు, గ్రామాల సర్పంచ్‌లు కూడా ముందుకు రావడం లేదని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలకు కప్పినట్లు స్లాబులకు కవర్లు కడుతున్న దుస్థితి నెలకొందన్నారు. వాన చినుకులను బకెట్లు పెట్టి పిల్లలను కాళ్ళమీద పడుకోబెట్టుకొని.. కండ్ల మీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం కేటాయించిన ఇంటిని లక్షలాది రూపాయలు పెట్టి మరమ్మతులు చేసినా, ఇలా కొద్దిసేపు కురిసిన వర్షాలకే స్లాబ్ నుంచి నీళ్లు కారుతూ ఉంటే.. ఇక ఈ ఇళ్లలో ఎలా ఉండగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ బ్రతుకులతో ఆడుకోకుండా ఇప్పటికైనా మరమ్మతులు చేయించి ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. సాక్ష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో సర్వస్వం కోల్పోయిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ కాలనీ దుస్థితి ఎలా ఉందో బాధితుల మాటలే అద్దం పడుతున్నాయి.