ఆ తేదీ కల్లా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి: సీఎం వైఎస్ జగన్..

by srinivas |
cm ys jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 46 వేల కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వివరించారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి.. హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రోడ్లును మార్చాలన్నారు. వాహనదారులకు అద్భుతమైన రోడ్లు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. రిపేర్లు చేయకముందు చేసిన తర్వాత ఫోటోలు తీసి నాడు – నేడుగా చూపించాలన్నారు.

ఎన్‌డీబీ ప్రాజెక్టుల్లో టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రహదారులపై ముందుగా గుంతలు పూడ్చి, ఆ తర్వాత కార్పెటింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేకించి కొన్ని రోడ్లు అని కాకుండా రాష్ట్రం మొత్తం చేయాలని, ఎక్కడా ఒక చిన్న గుంత కూడా కనిపించకూడదన్నారు.

పనులు చేయకపోతే కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టులో

వర్షాలు తగ్గగానే డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్‌ చేయాలని సీఎం ఆదేశించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన వారు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు వెంటనే మొదలు పెడతామని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed