ఉద్యోగులకు సీఎం గిఫ్ట్..

by Shyam |

ఆర్థికశాఖ ఉత్తర్వులు

దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనాతో పోరాటంలో ముందున్న పలు విభాగాల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను ఏప్రిల్ నెలకుగాను ప్రభుత్వం సాంక్షన్ చేసింది. సీఎం ప్రత్యేక ఇన్సెంటివ్‌గా పేర్కొనే ఈ నగదు ప్రోత్సాహకాలు.. వచ్చే నెల 1వ తేదీన జీతంతో పాటు ఆయా విభాగాల ఉద్యోగులకు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరితో పాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులందరికీ తమ గ్రాస్ సాలరీలో 10 శాతం, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకు జీతంతో పాటు రూ.7500, హెచ్ఎండబ్లూఎస్ అండ్ ఎస్‌బీ (హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజీ బోర్డు)లో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకు రూ.7500, జీహెచ్ఎంసీ కాకుండా రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.5000, రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ మల్టీపర్పస్ కార్మికులకు రూ. 5000 అదనంగా చెల్లించనున్నారు.

అయితే ప్రస్తుతం డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ అదనపు ప్రత్యేక ప్రోత్సాహకాలు వర్తిస్తాయని.. లీవ్, సస్పెన్షన్, అనారోగ్యం, మరేదైనా కారణంతో విధుల్లో లేని వారికి ఈ ప్రత్యేక ప్రోత్సాహకాలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీతాలు చెల్లించే సమయంలో ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి, ఏ ఒక్క అర్హత లేని ఉద్యోగికి అదనపు వేతనం చెల్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Tags: telangana, corona fight, employees, cm gift, special incentives, finance, g.o issued

Advertisement

Next Story

Most Viewed