నేరుగా ప్రజల్లోకి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

by Shyam |
నేరుగా ప్రజల్లోకి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో మొదలు కానున్నది. జగిత్యాల జిల్లా మోతె సమీపంలో బహిరంగ సభతో ఇకపైన జిల్లాల్లో ప్రజలకు దగ్గరయ్యే కార్యాచరణ ప్రణాళికను పార్టీ కార్యాలయం సిద్ధం చేస్తున్నది. వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ భవనాలు నిర్మాణమై సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. వాటి ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఓపెనింగ్ కానున్నాయి.

స్పెషల్ ఫోకస్

ఏక కాలంలో అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు టీఆర్ఎస్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పరిపాలనాపరమైన పలు నిర్ణయాలు త్వరలో జరిగే అవకాశం ఉన్నది. సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీలో అసంతృప్తి, వ్యతిరేక స్వరం తదితరాలకు అనుగుణంగా త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంపై విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ధనుర్మాసం (పీడదినాలు) నడుస్తున్నందున సంక్రాంతి తర్వాత భారీ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నూతనోత్సాహంతో..

హుజూరాబాద్ చేదు ఫలితం తర్వాత తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పన్నెండు స్థానాలూ కైవసం చేసుకోవడం పార్టీలో మళ్ళీ ఉత్సాహాన్ని నింపినట్లయింది. ఈ నేపథ్యంలో ఇకపైన రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. తమిళనాడు పర్యటన సందర్భంగా అక్కడి డీఎంకే పార్టీ నిర్మాణంపై కేటీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఒక ప్రాంతీయ పార్టీగా డీఎంకే దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా బలంగా ఉందని ఇటీవల గుర్తుచేసిన కేసీఆర్ సంస్థాగత నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఉదయనిధితో మాటల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో టీఆర్ఎస్‌ను సంస్థాగతంగా పటిష్టం చేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా నెలకొల్పడంపై రాష్ట్ర నాయకత్వం నజర్ వేసింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయినా జిల్లాల నిర్మాణం మాత్రం పెండింగ్‌లో ఉన్నది. ఒకవైపు పార్టీలో బాధ్యతలు అప్పజెప్పడం, మరోవైపు నామినేటెడ్ పోస్టులతో అసంతృప్తిని పారదోలడం లాంటి చర్యలతో శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాలనుకుంటున్నది.

Advertisement

Next Story

Most Viewed