- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ బైపోల్… సీఎం కేసీఆర్ వ్యూహత్మక అడుగులు
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్‌లో అభ్యర్థిని ఖరారు చేయడంలో టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతుంది. ఇంతకాలం ఈటల రాజేందర్‌పైనే ఆధారపడిన పార్టీ అధినేతకు ఇప్పుడు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం సవాల్‌గా మారింది. స్థానికుడికే టికెట్ ఇవ్వాలని సూత్రరీత్యా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థి ఎవరైనా అంతిమంగా గెలిపించేది కేసీఆర్ ఫోటో, కారు గుర్తే అని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అదే సమయంలో అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ పరంగానే ప్రచారాన్ని మొదలుపెట్టారు నేతలు. చివరి నిమిషం వరకూ అభ్యర్థి పేరును గోప్యంగానే ఉంచాలనుకుంటున్నది టీఆర్ఎస్. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ వచ్చినందున అక్కడ పర్యటించి పార్టీ పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసినా.. కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగానే వెనకబడింది. గతంలో దాదాపు మూడింట ఒక వంతు ఓట్లు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి పేరునే పార్టీ నాయకత్వం ఖరారు చేస్తుందా? లేక మారుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పరస్పర రాజకీయ ప్రత్యర్థులుగా తేలిపోయింది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు తనకు రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకుంటుందా? లేక జాతీయ స్థాయిలో ఉన్నట్లుగా బీజేపీని భావిస్తుందా? అనేది కీలకంగా మారింది. ఈ పార్టీ వైఖరిని బట్టి ఓట్ల చీలిక, దాని ప్రభావం ఏ పార్టీపై ఉంటుందనేది తేటతెల్లమవుతుంది.
అభ్యర్థిపై ఆద్యంతం సస్పెన్స్
అభ్యర్థిని ఖరారు చేయడంలో టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాన్ని అవలంబిస్తోంది నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు, కులం, స్థానికత, వ్యక్తిగత పలుకుబడి తదితర అంశాలపై సర్వే జరిపిస్తుంది. ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంటుందో ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది. వారు ఇచ్చే ఇన్‌పుట్స్ ఆధారంగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవిని కేసీఆర్ ఎంపిక చేస్తారని స్వంత పార్టీ నేతలు కూడా అంచనా వేయలేకపోయారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఊహకు అందని విధంగా నోముల భగత్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం అలాంటి వ్యూహమే పునరావృతమవుతుందని సమాచారం. ఎన్నికల షెడ్యూలు ప్రకటన వెలువడేంత వరకు ఈ సర్వే కొనసాగుతుందని, నామినేషన్ల సమయానికి అభ్యర్థిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవచ్చని సమాచారం.
సెకండ్ ర్యాంక్ లీడర్‌షిప్ లేని లోటు
ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ కార్యాచరణ వ్యక్తి కేంద్రంగానే జరుగుతున్నందున.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చుట్టే పార్టీ నిర్మాణం కేంద్రీకృతమైంది. సెకండ్ ర్యాంక్ లీడర్‌షిప్ లేని లోటు ఈటల రాజీనామా తర్వాత పార్టీ బలంగా గ్రహించగలిగిందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. వ్యక్తి కేంద్రంగానే రాజకీయం నడిచినందున ఆ వ్యక్తి పార్టీ మారిన తర్వాత దీటైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన పట్టును మళ్ళీ ’గ్రౌండ్ జీరో’ నుంచి మొదలుపెట్టుకోవాల్సి వస్తున్నదని, పార్టీ ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను చేపట్టాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
ఈ కారణంగానే గ్రామానికో ఎమ్మెల్యే, మండలానికో మంత్రి తరహాలో పార్టీ తరపున ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈటల తనకంటూ ఒక వర్గాన్ని, పలు సెక్షన్ల ప్రజలతో బలమైన పునాదిని ఏర్పర్చుకున్నందువల్ల.. ఇప్పుడు ఆయన నుంచి వారిని దూరం చేయడానికి, టీఆర్ఎస్ వైపు తిప్పుకోడానికి ప్రలోభాల పర్వం మొదలైంది. దీనికి తోడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వలన ఒరిగే ప్రయోజనం, లాభనష్టాల గురించి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా అదనపు ఓట్లు ఎన్ని వస్తాయి? దూరంగా ఉంచడం ద్వారా ఓట్లలో చీలిక ఏ మేరకు టీఆర్ఎస్‌కు ఉపయోగపడుతుంది?.. లాంటి తదితరాలపై కూడికలు, తీసివేతలు కూడా జరుగుతున్నాయి. గత నెలలో కేటీఆర్‌ను కలిసినప్పుడే కౌశిక్‌రెడ్డి పార్టీ మార్పుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత స్వయంగా ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒకవేళ చేర్చుకోవాలని పార్టీ భావించినట్లయితే బేషరతుగానే ఉండొచ్చని సమాచారం. టికెట్ ఇవ్వాలన్న షరతులకు ఆస్కారం ఉండకపోవచ్చని తెలిసింది.
బీసీ నేతలకే బాధ్యతలు
టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను బీసీ వ్యక్తులకే అప్పగించాలనుకుంటున్నట్లు తెలిసింది. కీలకమైన పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌రావును రంగంలోకి దించడం కేసీఆర్ దీర్ఘకాలంగా పాటిస్తున్న విధానం. అయితే ఈసారి మాత్రం ఈటల రాజేందర్ బీసీ వ్యక్తి కావడంతో వీలైనంత వరకు హరీశ్‌రావును దూరంగానే ఉంచి కథ నడిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆత్మగౌరవం నినాద ప్రభావం, బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో వీలైనంత వరకు టీఆర్ఎస్ తరఫున కూడా బీసీలకే క్షేత్రస్థాయిలో బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ భావిస్తుంది. అందుకే హరీశ్‌రావు రంగంలోకి దిగినా.. సిద్దిపేట నుంచే హుజూరాబాద్‌లో వ్యూహాన్ని అమలు చేయిస్తున్నారు.