కేసీఆర్ గొప్ప నటుడు: విజయశాంతి

by Shyam |
కేసీఆర్ గొప్ప నటుడు: విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగుదేశం హయాంలో మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారని, అమరవీరుల శవాలపై కూర్చుని పాలన సాగిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. బీజేపీలో చేరిన తర్వాత పార్టీ కార్యాలయానికి తొలిసారి వచ్చిన విజయశాంతి ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైందని, టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ప్రజల సంక్షేమంకంటే ఆయనకు డబ్బు మీదనే ప్రేమ ఎక్కువని ఆరోపించారు. రాఖీ కట్టిన చెల్లెళ్ళకు లక్ష రూపాయలు ఇవ్వలేని కేసీఆర్ ఈ ఆరున్నరేళ్ళ పాలనలో మాత్రం లక్ష కోట్ల రూపాయలకంటే ఎక్కువే ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, వారి బాగు గురించి ఆయనకు శ్రద్ధే ఉన్నట్లయితే వరద బాధితులకు పూర్తిస్థాయిలో సాయం ఎందుకు చేయడంలేదని నిలదీశారు.

గతంలో తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటూ సోనియాగాంధీకి హామీ ఇచ్చారని, కానీ మాట తప్పారని గుర్తుచేశారు. తన కుటుంబం నుంచి ఎవ్వరినీ రాజకీయాల్లోకి తీసుకురానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తల్లి తెలంగాణ పార్టీని పచ్చి స్వార్థంతో కేసీఆర్ టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోంచి తనను తప్పించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారని, ఒక పథకం ప్రకారమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులచేత తనను తిట్టించారని అప్పటి చేదు అనుభవాలను గుర్తుచేశారు.

తాను సినీ రంగంలో నటిని అయితే కేసీఆర్ మాత్రం తనకంటే గొప్ప నటుడు అని వ్యాఖ్యానించారు. తాను 1998 నుంచే తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నానని, అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తనకంటే బాగా తెలుసని అన్నారు. కొన్ని ప్రత్యేకమైన కారణాలతోనే తాను అప్పట్లో బీజేపీని వీడాల్సి వచ్చిందని గుర్తుచేసిన ఆమె తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక కారణమన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, ఇందుకు ఎవరు సూత్రధారో, ఎవరు పాత్రధారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయం చేసే కేసీఆర్‌కు ఇక భవిష్యత్తంతా గడ్డుకాలమేనని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు మాత్రం బీజేపీదే అని జోష్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed