దేశ పాలనలో జాతీయ పార్టీలు విఫలం: కేసీఆర్

by  |   ( Updated:2020-03-12 06:28:31.0  )
దేశ పాలనలో జాతీయ పార్టీలు విఫలం: కేసీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో
దేశాన్ని పాలించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై 50ఏళ్ల పోరాటం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ బీజేపీ కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కేంద్రానికి పన్నులు వేసే అధికారం మాత్రమే ఉంటుందని, రాష్ట్రాలకు ఇచ్చే నిధులను తగ్గించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. జీఎస్టీ వలన రాష్ట్రానికి లోటు ఏర్పడిందని దానికి ఐదేండ్ల పాటు కేంద్రమే భరించాలని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్ముకుంటే దేశ ప్రజలకు శంకరగిరి మాన్యాలేనని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.3,900 కోట్ల పైచిలుకు డబ్బులు కేంద్రం నుంచి రాలేదని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇవ్వకపోగా రూ.1,400 కోట్లు అప్పులు తీసుకోవాలని కేంద్రం సూచించిందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రానికి రూ.50 వేల కోట్ల ఆదాయం ఇస్తుంటే..మనకు వచ్చేది రూ.20 వేల కోట్లు కూడా లేవని ఆయన వివరించారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి వివరించారు.

Tags: national parties are failure, bjp and congress, assembly, cm kcr, gst tax

Advertisement

Next Story