లాక్‌డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు : హోంమంత్రి

by Anukaran |   ( Updated:2021-04-28 11:39:55.0  )
Home Minister Mahmood Ali
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంపై తనకు స్పష్టంగా తెలియదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని హోం మంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ పెట్టడం కేసీఆర్‌కు కూడా ఇష్టం లేకపోయినా రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. త్వరలోనే సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరణాలు కూడా పెరుగుతున్నాయన్నారు. వీటన్నింటిని గమనంలోకి తీసుకుని తుది నిర్ణయాన్ని సీఎం ప్రకటిస్తారని వివరించారు.

రాష్ట్రంలో, కేంద్రంలో త్వరలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. డీజీపీ, ముగ్గరు పోలీసు కమిషనర్లతో బుధవారం లక్డీ-కా-పూల్ కార్యాలయంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తతో కలిసి సమావేశమయ్యారు. సెకండ్ వేవ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ అమలు, సవాళ్ళు తదితరాలపై ఈ సమావేశంలో చర్చించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, లాక్‌డౌన్ ఉండదని చెప్తూనే ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ గతేడాది మొదటి వేవ్‌లో సమర్ధవంతంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్ వేవ్‌లోనూ అదే తీరులో పనిచేస్తోందని కితాబునిచ్చారు.

ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ మందులను బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని గుర్తుచేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు నమాజ్, తరావీ చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed