‘పూరి’ తరహాలో యాదాద్రి బస్టాండ్…!

by Shyam |   ( Updated:2020-11-12 00:36:43.0  )
‘పూరి’ తరహాలో యాదాద్రి బస్టాండ్…!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి ఆలయ కీర్తి సిగలో మరో కలికితురాయిని చేర్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే ఆలయ నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, నిర్మాణానంతరం దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులకు కోసం మరిన్ని సౌకర్యాల కల్పనకు పూనుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా యాదాద్రిలో బస్టాండ్ నిర్మించాలని, అందులో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆర్కిటెక్చర్లు, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు యాదాద్రి బస్టాండ్ నిర్మాణ నమూనాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ కొండ కింద రెండు ఎకరాల్లో నిర్మించే బస్ టెర్మినల్‌ను ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ బస్టాండ్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.

బస్టాండ్ 7 ఎకరాల్లో.. డిపో 9 ఎకరాల్లో..

కొండకు అతిసమీపంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను ఇక్కడి నుంచి తొలగించి ఐదు కిలోమీటర్ల దూరంలో రాజపేట రూటులోని సైదాపురంలో బస్ డిపోతో పాటు బస్టాండ్‌ను నిర్మించనున్నారు. ఏడెకరాల్లో బస్టాండ్‌, తొమ్మిది ఎకరాల్లో డిపోను నిర్మించాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల నుంచి బస్సులు యాదాద్రికి వచ్చే వీలు కల్పిస్తూ నిర్మిస్తూ, 150 బస్సులు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరో బస్ టెర్మినల్‌ను గండిచెరువు వద్ద రెండెకరాల్లో నిర్మించనున్నారు. ఈ టెర్మినల్‌ను పూరి తరహాలో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఆలయ ప్రారంభానికి ముందే టెర్మినల్, డిపోల అన్ని పనులను పూర్తి చేయాల‌ని మంత్రులు, అధికారులను ఆదేశించారు.

పూరి బస్టాండ్ తరహాలో..

సీఎం కేసీఆర్ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడి బస్టాండ్‌ను ముగ్ధుడై అదే తరహాలో యాదాద్రిలో బస్ టెర్మినల్‌ను కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాల మేరకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్ అండ్ అధికారులతో పూరి తరహా బస్ టెర్మినల్ నిర్మించేలా చర్చించారని సమాచారం. ఈ టెర్మినల్ బస్టాండ్‌లా కాకుండా ఒక ఆలయాన్ని చూసినట్టుగా ఉంటుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు మంత్రులు యాదాద్రిలోని స్థలాన్ని పరిశీలించారు. గండిచెరువు వద్ద టెర్మినల్‌ను అభివృద్ది చేసేందుకు మంచి డిజైనర్ కోసం వెతికే పనిలో యంత్రాంగం ఉంది.

ప్రస్తుతం బస్టాండ్ పరిస్థితేంటి..?

స్తుతమున్న బస్టాండ్ కొండకు సమీపంలో దాదాపు నాలుగెకరాల్లో ఉంటుంది. కాలినడకన కొండ దిగిన భక్తులు సునాయసంగా చేరుకునేలా ఉంటుంది. అయితే ఈ స్థలానికి భారీగా డిమాండ్ ఉండడంతో బస్టాండ్‌ను సైదాపురానికి తరలించి ఆ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌తో పాటు వెనక భాగంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్టాండ్‌ను సైదాపురానికి తరలించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తరలిస్తే యాదాద్రి రూపురేఖలు కోల్పోతుందని, వందలాది మంది చిరు వ్యాపారులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తరలింపు వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed