రెండు వారాల తర్వాత ప్రగతి‌భవన్‌కు సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2020-07-11 10:48:48.0  )
రెండు వారాల తర్వాత ప్రగతి‌భవన్‌కు సీఎం కేసీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: సరిగ్గా 13రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లోకి అడుగుపెట్టారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు గతనెల 28వ తేదీన ప్రారంభం కావడంతో ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ అదే రోజు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్య మంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రావడం ఇప్పుడే.

ఈ రెండు వారాల వ్యవదిలో ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అంటూ ట్విట్టర్‌లో ప్రత్యేక హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద చర్చే జరిగింది. హైకోర్టులో సైతం ఒక పిటిషన్ దాఖలైంది. ప్రగతి భవన్ సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్ సోకింది. క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారేమో అనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ‘కేసీఆర్ ఆచూకీ తెలియడం లేదు. ఆయన మా ముఖ్యమంత్రి. ఆయన గురించి తెలుసుకునే హక్కు మాకుంది’ అంటూ యువకుడు ప్రగతి భవన్ ఎగ్జిట్ గేటు దగ్గర ప్లకార్డు పట్టుకుని ప్రదర్శన చేశాడు.

నగరంలో కరోనాతో ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని, చిట్టచివరి ప్రాధాన్యత అంశమైన సచివాలయం కూల్చివేతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ రెండు వారాల వ్యవధిలో ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రగతి భవన్‌కు వచ్చిన వెంటనే వ్యవసాయ రంగంపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed