- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా కీలక సమావేశం.. హాజరవుతున్న సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద ప్రభావం, మావోయిస్టు పార్టీ ప్రాబల్యం తగ్గిందని బలంగా అభిప్రాయపడుతున్న కేంద్ర హోంశాఖ.. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో ఢిల్లీలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది దేశం మొత్తం మీద 61 జిల్లాల్లో మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలు ఉంటే ఈ ఏడాది అది 45 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్లనే ఇది సాధ్యమైందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మాత్రమే మావోయిస్టు పార్టీకి పునాది లేకుండా చేయవచ్చని కేంద్ర హోంశాఖ భావిస్తున్నదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచే ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడానికి కార్యాచరణ ప్రణాళిక ఖరారైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంయుక్త గాలింపు చర్యలను మరింత ఉధృతం చేసే దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరగనున్నది.
దేశం మొత్తం మీద 91 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ 30 జిల్లాల్లో చాలా నామమాత్రంగా ఉన్నాయని, 61 జిల్లాల్లో ఒక మోస్తరుగా ఉన్నాయని, ఇందులో ఎక్కువగా 45 జిల్లాల్లో ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నది. గడచిన ఐదేళ్ళలో దేశం మొత్తం మీద 380 మంది భద్రతా బలగాలు, వెయ్యి మందికిపైగా పౌరులు, సుమారు 900 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అంచనా వేసింది. ఇదే ఐదేళ్ళ కాలంలో దాదాపు 4200 మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు పోలీసులకు లొంగిపోయారని, చాలా కొద్దిమంది ఆ పార్టీకి దూరమయ్యారని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
వివిధ రాష్ట్రాలతో సాంకేతికంగా, శాఖాపరంగా సమన్వయం కొనసాగిస్తూ చేపట్టిన ఆపరేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయని అంచనాకు వచ్చిన కేంద్ర హోం మంత్రి.. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా హోం మంత్రులు లేదా డీజీపీలు లేదా ప్రధాన కార్యదర్శుల నుంచి వివరాలను తెలుసుకోనున్నారు. ప్రతీ ఏటా ఒకసారి లేదా రెండుసార్లు ఇలాంటి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా గతేడాది నుంచి జరగలేదు. చత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో మావోయిస్టులు జరిపిన దాడిలో ఒకే సంఘటనలో 22 మంది చనిపోయిన సంఘటనను ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు కేంద్ర పారా మిలిటరీ బలగాలు, బస్తరీయ కమాండోలు, ‘కోబ్రా’ దళాల సంయుక్త ఆపరేషన్‌ల గురించి లోతుగా చర్చించే అవకాశముంది. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రజల రాకపోకల కష్టాలను తొలగించడానికి బ్రిడ్జీల నిర్మాణం, విద్యా సంస్థలను నెలకొల్పడం, వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవడం లాంటి అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ నుంచి ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొంటున్నందున.. రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఏ మేరకు ఉన్నాయి, ఎప్పటికప్పుడు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, డీజీపీ వారం రోజుల పాటు ఆదిలాబాద్, కొత్తగూడెం తదితర జిల్లాల్లో మకాం వేసి చేపట్టిన యాక్షన్ ప్లాన్ వంటి అంశాలను వివరించే అవకాశం ఉంది. కరోనా కారణంగా మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఇటీవల చనిపోవడం, ఆయన భార్య శారద గత వారం డీజీపీ ఎదుట లొంగిపోవడం లాంటి అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. గతంలో నీతి ఆయోగ్ లాంటి సమావేశాలకు సైతం హాజరుకాకుండా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొనడం గమనార్హం.