'జగనన్న జీవక్రాంతి' పథకం ప్రారంభం

by srinivas |
జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యమే జగనన్న జీవక్రాంతి పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడంతో రైతుల్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఈ జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్‌తో ఒప్పందం చేసుకోవడంతో పాడి రైతులకు, మహిళలకు ఆర్ధికంగా చేయూతనిస్తుందని చెప్పుకొచ్చారు.

రూ.1,869 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 45-60 ఏళ్ల వయస్సు లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు గొర్రెలు, మేకలు ఇస్తారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు, బ్యాకు రుణాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed