- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ తీపి కబురు.. ఆ పదవులకు గ్రీన్ సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినేత సీఎం జగన్ తీపికబురు చెప్పేందుకు రెడీ అయ్యారు. ఎన్నాళ్ల నుంచో నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్న వారికి అవకాశం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వారికి కూడా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే ఈ నామినేటెడ్ పదవుల పందేరంలో జగన్ మార్క్ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే 50% మహిళలకు, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యతాంశంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. ఈ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే త్వరలో జరగబోయే క్యాబినేట్‌లో మార్పులకు, ఎమ్మెల్సీల భర్తీపైనా ఓ క్లారిటీ వస్తుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు మధ్యాహ్నాం లేదా సాయంత్రానికి నామినేటెడ్ జాబితా విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
కేబినెట్ – ఎమ్మెల్సీలపైనా క్లారిటీ !
వైసీపీ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ప్రకటనకు రంగం సిద్దమైంది. దాదాపుగా పదవుల కేటాయింపు పూర్తయింది. అయితే సీఎం జగన్ జాబితాపై కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మంగళవారం సాయంత్రానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నాం లేదా సాయంత్రం జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించిన తర్వాతనే నామినేటెడ్ పదవులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
ఓడిన నేతలకూ పోస్టులు..
పార్టీ కోసం తొలి నుండి పని చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు జిల్లా స్థాయి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ పాలసీగా నిర్ణయించిన విధంగా సామాజిక సమీకరణాలను పక్కాగా అమలు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ చైర్మన్, మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మన్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవులను భర్తీకి ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 32 కార్పొరేషన్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో కొందరికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వారిలో ఇంకా పదవులు ఇవ్వలేకపోయిన వారికి రాష్ట్ర స్థాయి పోస్టులు ఇవ్వబోతున్నారు.
దాదాపుగా ఖరారైన పేర్లు ఇవే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, రౌతు సూర్యప్రకాశ రావు, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన తోట వాణి, యువనేత దేవినేని అవినాశ్, బొప్పన భావన కుమార్, బాచిన చైతన్యలకు పదవులు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల వారీగా జిల్లా పరిషత్‌లు ఖరారు కావటంతో ఏ జిల్లాలో ఎవరు జెడ్పీ ఛైర్మన్ చేయాలనే అంశం పైనా సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే హైకోర్టు జెడ్పీటీసీ – ఎంపీటీసీ ఎన్నికల రద్దు నిర్ణయం పైన డివిజన్ బెంచ్ స్టే ఇచ్చినా..తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాతనే ఆ ఎన్నికల కొనసాగింపుగా ఓట్ల లెక్కింపు లేదా కొత్తగా ఎన్నికలు జరపటమా అనే అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు.
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు.. ఓడిన నేతలు కూడా అదే హోదాలో ఉండేలా ప్రభుత్వం పదవులను కట్టబెట్టనుంది. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. దాదాపు 80 శాతం మేర మంత్రులు సైతం మారనున్నారు. వారి స్థానంలో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు. అదే ఎన్నికల కేబినెట్ కావటంతో…ఆ ఎంపిక చుట్టూనే ప్రస్తుత నామినేటెడ్ పోస్టులు.. ఎమ్మెల్సీల పదవుల ఎంపిక ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.