ఇళ్లు కోల్పోయిన వారికి రూ.95,100..కొత్త ఇల్లు మంజూరు

by srinivas |
jagan-cm
X

దిశ, ఏపీ బ్యూరో: వరదల్లో పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100తో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద బాధితుల సాయం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరదలతో ముంపునకు గురైన ప్రతీ ఇంటికి పరిహారం అందాలి. ఎవరికీ అందలేదనే మాట వినపడకూడదు. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. ఉదారత చూపించాలి అని ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు ఎక్కడా లోటు రానీయకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

ప్రతీ ఒక్క కుటుంబానికి సాయం అందాలి
వరద బాధితులకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు ఇవ్వాలి. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి. వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి సదుపాయాలు కల్పించి..ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలి. విద్యుత్, రక్షిత తాగునీటి పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి అని సీఎం జగన్ ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌‌కు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా అధికారులు తక్షణమే స్పందిచాలి. జిల్లాల్లో ‘104’కు ప్రత్యేక అధికారిని నియమించాలి అని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇల్లు నిర్మించుకునేందుకు రూ.1,80,000

ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. బాధితులకు వెంటనే నగదు ఇవ్వాలి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100 నగదు ఇచ్చి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలి. అలాగే వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.1,80,000 కూడా ఇవ్వాలి. దీనివల్ల వారు వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టగలుగుతారు. అలాగే, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200ల నగదు వెంటనే అందించాలి అని సీఎం జగన్ ఆదేశించారు.

పశువులకు దాణా అందించాలి

పంటల నష్టం ఎన్యూమరేషన్‌ వెంటనే మొదలు పెట్టాలి. రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. అంతేకాక మరణించిన పశువుల కళేబరాల వల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. పశువులకు దాణా కూడా అందించాలి. పశువులు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారులను సూచించారు.

Advertisement

Next Story

Most Viewed