టూల్ కిట్ కేసులో దిశ రవికి ఐదు రోజుల పోలీసు రిమాండ్

by Shamantha N |
టూల్ కిట్ కేసులో దిశ రవికి ఐదు రోజుల పోలీసు రిమాండ్
X

న్యూఢిల్లీ: టూల్ కిట్ కేసులో బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఐదు రోజుల పోలీసు రిమాండ్‌కు ఢిల్లీ కోర్టు అనుమతించింది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన టూల్ కిట్‌‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర వివరాలున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులోనే బెంగళూరుకు చెందిన కార్యకర్త దిశ రవిని శనివారం అరెస్టు చేయగా ఆదివారం ఢిల్లీ స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రగా పేర్కొంటూ దిశ రవిని దర్యాప్తు చేయడానికి వారం రోజులు రిమాండ్‌కు అనుమతించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ కుట్రలో ఖలిస్తానీ జోక్యాన్నీ గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. గ్రెటా షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశ రవి ఫిబ్రవరి 3న ఎడిట్ చేశారని, ఇంకా చాలా మంది ఈ కుట్రలో భాగమై ఉన్నారని వివరించారు. తాను రైతుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలనుకున్నానని, కేవలం రెండే లైన్‌లు ఎడిట్ చేశానని దిశ రవి కోర్టు హాల్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దిశ రవినే ప్రధాన కుట్రదారు అని, ఖలిస్తానీ అనుకూల సంస్థతో కలిసి పనిచేశారని పోలీసులు ఆరోపించారు. టూల్ కిట్ తయారు చేయడంలో దిశ రవిది కీలక పాత్ర అని, గ్రెటా షేర్ చేయడంతో నేరపూరిత వివరాలు బహిర్గతమయ్యాయని, అందుకే వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి ఎడిట్ చేసిన టూల్‌కిట్‌ను షేర్ చేయించారని తెలిపారు. టూల్ కిట్‌ డాక్యుమెంట్‌నూ దిశ రవినే గ్రెటా థన్‌బెర్గ్‌తో షేర్ చేశారని వివరించారు

Advertisement

Next Story

Most Viewed