ఫైర్ బ్రాండ్‌కు లైన్ క్లియర్… అందుకే ఆ పదవి చేజారిందా..?

by Anukaran |
MLA Roja
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్. ఇతర పార్టీలను ఇరుకున పెట్టడంలో దిట్ట. తన పదునైన మాటల తూటాలతో విరుచుకుపడతారు. అన్ని అంశాలపై అవగాహన ఉన్న ఆమె ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. అవతలి వ్యక్తి ఎంతవారైనా సరే తన పంచ్‌లతో ముచ్చెమటలు పట్టిస్తారు. ఇక అసెంబ్లీలో అయితే సరేసరి. ఆమె లేచి నిలబడ్డారంటే ఈరోజు ఎవరిని కడిగేస్తుందోనని అవతలివారు అనుకునేటంతగా విరుచుకుపడతారు. తమ పార్టీని గానీ.. తమ పార్టీ అధినేతను గానీ ఎవరైనా ఏమైనా అంటే ఇక ఒంటికాలిపై లేస్తారు. ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్ ఎవరో తెలిసే ఉంటుంది కదూ.. ఆమె నగరి ఎమ్మెల్యే రోజా.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా చాలా దూకుడుగా ఉండేవారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పోరాటమే చేశారు. స్టార్ కాంపైనర్‌గా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అలాంటి రోజాకు వైసీపీలో ప్రాధాన్యం తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. రోజా పడిన కష్టానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన కేబినెట్‌లో చోటిస్తారని అంతా భావించారు. కానీ సీఎం జగన్ హ్యాండిచ్చారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజా అలిగారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం జగన్ తన క్యాంపు ఆఫీస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. అనంతరం ఏపీఐఐసీ చైర్మన్‌గా అవకాశం కల్పించి అలక వీడేలా చేశారు.

రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు ఉంటాయని సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునాడే తెలిపారు. సుమారు 80శాతం మార్పులు చోటు చేసుకుంటాయని కొత్తవారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో ఐదు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈసారి కేబినెట్‌లో తనకు చోటు కల్పిస్తారని రోజా ఆమె అనుచరులు.. అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు వైసీపీలో సైతం రోజాకు ఈసారి కేబినెట్‌లో బెర్త్ కన్ఫమ్ అంటూ ప్రచారం జరుగుతోంది.

మంత్రి పదవి దేవుడెరుగు..ఉన్న పదవి చేజారిందే.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలను పసిగట్టడం పార్టీలో ఎవరివల్ల కావడం లేదు. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఏపీ కేబినెట్‌ విషయంలో కూడా చివరి వరకు తెలియకుండా జగన్ జాగ్రత్త పడ్డారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో గానీ ఇతర పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారైనా జగన్ కేబినెట్‌లో తనకు చోటు కల్పిస్తారా అనేదానిపై కూడా రోజా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మంత్రి పదవి దేవుడెరుగు ఉన్న పదవి ఊడిపోయింది కదా అని రోజా తన అనుచరుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే రోజాతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు రెండు పదవులు ఉండకూడదనే కొత్త పాలసీని సీఎం జగన్ తీసుకున్నారని అందులో భాగంగా ఏపీఐఐసీ పదవిని వేరొకరికి కట్టబెట్టాల్సి వస్తోందని తెలిపారట. భవిష్యత్‌లో మీకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారట. ఈ సందర్భంగా రోజా కూడా తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాలసీ తీసుకున్నప్పుడు ముందే సమాచారం అందిస్తే పదవులకు రాజీనామా చేసేవాళ్లంకదా అని ప్రశ్నించారట. ఒక్కసారిగా ఇలా తొలగించడం వల్ల కార్యకర్తల్లో వేరేగా ప్రచారం జరుగుతుందని రోజా అన్నట్లు తెలుస్తోంది.

జగన్ మనసులో ఏముంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. ఈ విస్తరణలో రోజాకు బెర్త్ కన్ఫమ్ అవుతుందా అనే దానిపై సందేహం నెలకొంది. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రోజాకు మంత్రి పదవి రావాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తొలగించాల్సి ఉంటుంది. పెద్దిరెడ్డిని కేబినెట్‌ నుంచి తొలగించే ప్రసక్తే ఉండకపోవచ్చు. జిల్లాలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో రోజాకు ఈ సారి కూడా పదవి కష్టమే అవుతుంది. లేకపోతే ప్రస్తుతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రిని తప్పిస్తే రోజాకు మంత్రి పదవి ఖాయం.

ఇకపోతే త్వరలో ఏర్పడబోయేది ఎన్నికల కేబినెట్ కావడంతో రోజాకు ఇస్తే మంచిదనే అభిప్రాయం కూడా వైసీపీ వర్గాల్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి రోజాకు మంత్రి పదవి విషయంలో సీఎం జగన్ మనసులో ఏముందో తెలియాలంటే మరో ఐదు నెలలపాటు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed