వైజాగ్ కెమికల్ లీక్‌పై చిరు, పవన్ కల్యాణ్ ఆందోళన

by Shyam |   ( Updated:2020-05-07 01:19:19.0  )
వైజాగ్ కెమికల్ లీక్‌పై చిరు, పవన్ కల్యాణ్ ఆందోళన
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో స్టైరీన్ కెమికల్ లీక్ ఘటనపై సినీనటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. దుర్ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

చిరంజీవి ట్విట్టర్ ద్వారా..’విశాఖలో విషవాయువు స్టెరీన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి పరిశ్రమలు ప్రారంభించే విషయంపై సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు

పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ‘కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి. విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు భయకంపితులు అవుతున్నారు. అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయి’ అని మండిపడ్డారు. అంతే కాకుండా..

‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను’ అని ట్వీట్ చేశారు.

Tags: janasena, actors, pawankalyan, chiranjeevi, vizag, rr venkatapuram gas leak issue

Advertisement

Next Story

Most Viewed