- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాటి ఆటలకు మొగ్గు
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ (కొవిడ్ -19) భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో పిల్లలు, పెద్దలు చాలా మట్టుకు ఇండ్లలోనే ఉంటున్నారు. అయితే, పిల్లలు ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి పబ్జీ లాంటి ఆటలాడుతూ..డిజిటల్ డిటాక్స్ అవుతూ..స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం లేదు. నాటి ఆటల(పులి మేక, వామన గుంటలు, వంగుడు దునుకుడు, పచ్చీస్, తొక్కుడు బిల్ల) వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండా కాలంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండే ఆటలాడుతూ ఆనందంగా గడుపుతున్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అవుతున్న నేపథ్యంలో పిల్లలను బయటకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు. చివరకు తమ చిన్నతనంలో పెద్దలు నేర్పిన ఆటలను పిల్లలకు నేర్పించే పనిలో నిమగ్నం అయ్యారు. ఆ నాటి ఆటల్లో లాభం ఉన్నా ఆధునికత ముసుగులో నేటి తరానికి వాటిని అందించే వారే కరువయ్యారు. లాక్ డౌన్ వల్ల అలనాటి ఆటలను వారికి నేర్పి సరికొత్త రీతిలో తీర్చిదిద్దుతున్నారనే చెప్పాలి. పులి మేక, వామన గుంటలు,
వంగుడు దునుకుడు, పచ్చీస్, తొక్కుడు బిల్ల తదితర ఆటలతో పిల్లలు ఇంటి వద్దే నేర్చుకుని టైం పాస్ చేస్తున్నారు. అలాగే పిల్లల్లో జిజ్ఞాసను పెంచే చదరంగం, క్యారమ్ వంటి ఆటలపై అవగాహన పెంచుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే కోతి కొమ్మచ్చి, కబడ్డి వంటి ఆటలను ఇంటి వెనక ఖాలీ స్థలంలో నిబంధనలు మార్చి ఆడిస్తున్నారు. కరోనా వల్ల పిల్లలు బయటకు వెళ్లకుండా ఉంటే చాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు పిల్లలకు మాస్కులు కట్టి మరీ పాతకాలపు ఆటలు నేర్పిస్తున్నారు. ఎక్కువ మంది ఆడాల్సిన ఆటల్లో సంఖ్యను తగ్గించి సామాజిక దూరం కోసం మధ్య గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటూ నేర్పిస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, స్టేట్ సిలబసా, సెంట్రల్ సిలబసా అంటూ పోటీలతో పిల్లలను పుస్తకం పురుగులుగా మార్చిన తల్లిదండ్రులు, ఇంటికి రాగానే పుస్తకాలతో కుస్తీపడే చిన్నారులు కూడా ఇప్పుడు ఆనాటి ఆటలపై ఆసక్తి చూపిస్తున్నారు.
వాస్తవంగా ఆధునికత… ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అనే ముసుగేసి నేటి తరానికి పుస్తకం పురుగుల్లాగా మార్చేశారు చాలా మంది తల్లిదండ్రులు. నేటితరానికి సమాజంపై అవగాహన లేకుండా పోవడంతో పాటు మానవ సంబంధాలు అంటేనే తెలియకుండా పెరుగుతున్నారు.
ఉమ్మడి కుటుంబం నుండి చిన్న కుటుంబాలుగా మారిపోవడం కూడా పిల్లలకు మానవ సంబంధాల అనుబంధం లేకుండానే ఎదగాడానికి ఓ కారణమైంది. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి ముచ్చటించడం అన్నది అత్యంత అరుదైన విషయంగా మారిపోయింది. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ తల్లిదండ్రులు కూడా సోషల్ స్టేటస్ అన్న ఫోబియాకు చేరి కలివిడిగా ఉండటం మాని విడివిడిగా బతికే పరిస్థితికి చేరుకున్నారు. ఇంటికొచ్చిన పిల్లలు హోం వర్క్ చేసుకోవడం, టీవీ చూడటం, తినడం నిద్రపోవడం అన్నపద్ధతి నుంచి కూడా బయటకు వస్తున్నారు లాక్ డౌన్ కారణంగా. అటు పేరెంట్స్ ఇటు పిల్లలు ఇంటి పట్టునే ఉంటుండటంతో పాత కాలపు గుర్తులను నెమరు వేస్తూ వాటిని నేటి తరానికి అందించే పరిస్థితి అయితే కరోనా కల్పించిందని చెప్పక తప్పదు. అలాగే పిల్లలు, పెద్దల మధ్య అనురాగ బంధాలను కూడా పెంచే పరిస్థితి కల్పించింది స్వీయ నిర్బంధం అన్నది నిజం.
Tags: lockdown, corona virus (covid-19) effect, children, playing games