థర్డ్‌‌వేవ్ భయం.. చిన్నారులను కాపాడుకోవడం ఎలా..?

by Shyam |
kids 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థర్డ్ వేవ్‌లో పిల్లలకు కరోనా సోకుతుందన్న ప్రచారం నేపథ్యంలో చిన్నారులను పాఠశాలలకు పంపించేందుకు నిరాకరిస్తున్నారు తల్లిదండ్రులు. తరగతి గదుల్లో పకడ్బందీగా కోవిడ్ నిబంధనలు చేపట్టినప్పట్టికీ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కష్టతరమని భావిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభిస్తే ఆఫ్ లైన్ తరగతులతో పాటు ఆన్ లైన్ తరగతులను కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 7వ తరగతి వరకు విద్యార్థులకు పూర్తిగా ఆన్‌లైన్ తరగతులను మాత్రమే నిర్వహించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జులై 1 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రారంభించి భౌతికంగా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టి తరగతులు నిర్వహించాలనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే, పాఠశాల విద్యలో అన్ని తరగతుల వారికి భౌతిక తరగతులు నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతుంది.

కొవిడ్ నిబంధనలు విద్యార్థులకు కష్టతరం :

తరగతి గదుల్లో కొవిడ్ నిబంధనలు పక్కగా అమలుకావని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, నిత్యం మాస్క్ ధరించడం, శానిటైజర్లు వినియోగించడం వంటి కార్యక్రమాలు విద్యార్థులు అంతగా పాటించరు. ఉపాధ్యాయులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విద్యార్థులను అదుపు చేయడం కష్టతరమవుతుంది. ఈ క్రమంలో చిన్నారులకు సులభంగా వ్యాధి వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయి. 8.9,10 తరగతి విద్యార్థులు అవగాహనతో కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ 7వ తరగతి వరకు విద్యార్థులు జాగ్రత్తలు పాటించడం అసాధ్యమవుతుంది.

ఆఫ్ లైన్‌తో పాటు ఆన్‌లైన్ తరగతులు అవసరం :

విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఆఫ్‌లైన్ తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాలు కల్పించడం ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాల ప్రకారం విద్యార్థులు తరగతులకు హాజరయ్యే అవకాశముంటుంది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఆలోచించకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. థర్డ్ వేవ్‌లో పిల్లలకు వ్యాధి సోకుంతుందని ప్రచారాలు కొనసాగుతున్న క్రమంలో తల్లిద్రండ్రులకు ప్రభుత్వం భరోసాను కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవరసరముంది.

పిల్లలకు వ్యాధి సోకితే ప్రభుత్వానిదే బాధ్యత :

ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా విద్యాసంస్థల ప్రారంభ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా ప్రబలి పిల్లలకు వ్యాధి సోకితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. చిన్నారుల ప్రాణాలకు ముప్పువాటిల్లితే కుటుంబాలు నాశనమవుతాయి.

-వెంకట్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు

పిల్లలను పాఠశాలకు పంపే ప్రసక్తే లేదు..

పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు ఎంత పాటించినా కానీ, చిన్న పిల్లలను అదుపు చేయడం కష్టం. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడంపై పిల్లలు అంతగా దృష్టిసారించలేరు. తరగతులు ప్రారంభించినప్పటికీ పిల్లలను పాఠశాలకు పంపే ప్రసక్తే లేదు. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తే పిల్లలు ఇంట్లో ఉండి తరగతులను హాజరవుతారు.

కిషోర్, పేరెంట్, హైదరాబాద్

8,9,10 విద్యార్థులకు మాత్రమే ఆఫ్‌లైన్ క్లాసులు పెట్టాలి..

పాఠశాలల్లో 8, 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రమే భౌతిక తరగతులు నిర్వహించాలి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్కో తరగతిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను అనుమతించి పాఠాలు బోధించాలి. 7వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఈ ప్రక్రియ వలన విద్యార్థులను వైరస్ నుంచి కాపాడుకోవచ్చు.

-శివ, పేరెంట్ హైదరాబాద్

Advertisement

Next Story

Most Viewed