- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణాలు తీస్తున్న నాలాలు
దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం సముద్రంలా మారుతోంది. రోజుకు ఒకరి చొప్పున వరద నీటికి బలవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు, యంత్రాంగం తమ చర్యలను సమర్థించుకుంటుండటం విచారకరం. 2014కు ముందు కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ వర్షం వస్తే రాజ్‌భవన్, గాంధీభవన్ ముందు రోడ్లన్నీమునిగిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్షం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే నాలాల ఆక్రమణలన్నీ తొలగిస్తామని ప్రకటించారు. గడిచిన ఆరేండ్లలో అధికార పార్టీ ఒక ఇంచు కూడా కొత్తగా వరద కాల్వను తీసింది లేదు. కనీసం అప్పటికే ఉన్న వరదనీటి వ్యవస్థను మెరుగుపరిచే పనులు కూడా చేపట్టలేదు. దీంతో వర్షాకాలంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతకాల్సి వస్తోంది. నాలాల ఆక్రమణలను తొలగించక పోవడమేగాక నాలాల వెడల్పు, రక్షణ చర్యలు చేపట్టక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు, సామాజిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
మహా నగరంలో నాలాలు విస్తరణ, జాలీల ఏర్పాటుకు మూడేండ్ల క్రితం చేపట్టిన పనుల్లో ఇప్పటికీ 20శాతం కూడా పూర్తి కాలేదంటే బల్దియా ఎంత నిర్లక్ష్యంతో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సిటీలోని 391 కిలోమీటర్ల మేజర్ నాలాల పునరుద్ధరణ పనుల కోసం 2017లో వరదలు వచ్చిన సమయంలో రూ.230 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఆ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో నాలుగేండ్ల తర్వాత కూడా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఫలితంగా ఓపెన్ నాలాల బారినపడి చిన్నారులు, గర్భిణులు, యువకులు చనిపోతున్నారు. కాలనీలు, బస్తీల పక్కన ఉన్న వాటిల్లో మెజారిటీ భాగం ఓపెన్ నాలాలే.. వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఏ వర్షానికి ఎవరు బలవుతారోననే రాత్రి, పగలు నిద్రలేకుండా గడపాల్సి వస్తోంది. నేరేడ్‌మెట్ నాలాలో కొట్టుకుపోయి బాలిక చనిపోయిన ఘటన మరవకముందే సరూర్ నగర్‌లో మరో వ్యక్తి వరద నీటిలో ప్రాణాలు కోల్పోయాడు. నేరేడ్‌మెట్ ప్రాంతంలో గతంలోనూ ఓ మహిళ నాలాలో పడి మరణించారు. గతేడాది పాతబస్తీ, ఎల్‌బీ నగర్‌లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదు. నాలాల విస్తరణ విషయాన్ని పక్కన పెట్టినా.. కనీసం నాలాలకు పై కప్పులు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వ యంత్రాంగం చేయకపోవడం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతోంది.
ఓపెన్ నాలాల కారణంగా ఈ మూడు రోజుల్లో ముగ్గురు మరణించగా.. గతంలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఉప్పుగూడ అరుంధతి కాలనీ పరిధిలో కొన్నేళ్ల క్రితం అంబేడ్కర్ జయంతి రోజున ఓ బాలుడు క్రికెట్ ఆడుతూ నాలాలో పడి మృతి చెందాడు. ఐదేండ్ల క్రితం అరుంధతి నగర్ వద్ద నల్లవాగు నాలాలో బంతి కోసం దిగిన బాలుడు మృత్యువాత పడ్డాడు. పూల్‌బాగ్ వద్ద కూడా నల్లవాగు నాలాను ఆనుకుని ఉన్న ఇల్లు కూలిపోవడంతో నలుగురు మరణించారు. 2010లో తలాబ్‌కట్ట నాలాలో బాలుడు మరణించగా, చిలకలగూడ నాలాలో పడి ఇద్దరు మృతి చెందారు. కవాడిగూడ ప్రాగాటూల్స్ వద్ద ఉన్న నాలాలో పడిపోయి ఓ వ్యక్తి మరణించాడు. ఎప్పుడు వర్షాకాలం వచ్చిన ఓపెన్ నాలాలు నోళ్లు తెరిచిన మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. మన్సూరాబాద్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్‌కేపురం, హయత్‌నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. మోతీనగర్ డివిజన్ బబ్బుగూడ, రామారావునగర్, స్నేహపురి కాలనీ, లక్ష్మీనగర్, గాయత్రినగర్‌లో ఓపెన్ నాలాల ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. హుస్సేన్‌సాగర్‌కు వరదను తీసుకొచ్చే కూకట్‌పల్లి నాలాకు చాలా చోట్ల రక్షణ గోడ లేదు. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్‌సెల్ ఆఫీస్ ప్రాంతాల్లో నాలాలు, పటేల్‌కుంట చెరువు వద్ద ప్రారంభమై హెచ్‌ఎంటీనగర్ చెరువులో కలిసే నాచారం పెద్ద నాలాలోనూ తరచుగా ప్రజలు, పశువులు ప్రమాదాలబారిన పడుతున్నాయి.
ఆక్రమణల తొలగింపు కొనసాగింపే..
ఏండ్లు గడుస్తున్నా నాలాల పరిస్థితి మాత్రం మారడం లేదు. విస్తరణ సంగతేమో గానీ.. కొత్తగా మరిన్ని నాలాలు మరింత కుచించుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మించినా సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదు. 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగాయి. అప్పుడే నాలాలపై ఎన్ని ఆక్రమణలున్నాయో, ఎంత మేర విస్తరించాలన్నది నిర్ణయించేందుకు కిర్లోస్కర్ కమిటీ వేశారు. అప్పటి ఎంసీహెచ్‌లో 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలను విస్తరించాలని ఆ కమిటీ నివేదిక సమర్పించింది. 10 వేల ఆక్రమణల తొలగింపుతో పాటు విస్తరణకు రూ.6,700 కోట్లు ఖర్చవుతాయని కమిటీ అంచనా వేసింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు అనంతరం ఓయాంట్స్ కన్సల్టెన్సీ నాలాలపై సర్వే నిర్వహించి వరద ఇబ్బందులు తగ్గాలంటే 390 కిలోమీటర్ల మేర నాలాల విస్తరణ పనులు చేపట్టాలని సూచించింది. 28 వేల ఆక్రమణల తొలగింపునకు రూ.12వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇక 2017లో వర్షాలు కురిసినప్పుడు రాత్రి వేళ స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలపై తీసుకోవాల్సిన చర్యలకు అప్పటికే నివేదికలున్నా సరే.. మరోమారు అధ్యయనం చేయించారు. ఈ సారి టెక్నాలజీని కూడా జోడించి డ్రోన్ కెమెరాలతో చిత్రాల సేకరణ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల వద్ద ఉన్న నాలాల వాస్తవ విస్తీర్ణం, ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. చివరకు నాలాలపై 12,182 ఆక్రమణలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఓయాంట్స్ సంస్థ బఫర్ జోన్‌తో కలిపి ఆక్రమణలు గుర్తించగా, 2017 నాటి సర్వేలో నాలాల వాస్తవ విస్తీర్ణం వరకు మాత్రమే ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. దీంతో ఆక్రమణల సంఖ్య 12,182కు తగ్గింది. తొలగింపునకు రూ.10వేల కోట్లు అంచనా వేయగా.. మొదటి విడతలో రూ.230 కోట్లతో 842 ఆక్రమణలు తొలగింపు పనులు చేపట్టారు. నారాయణగూడ, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నాలాలను ఆక్రమించి ఆరంతస్తుల పాఠశాల భవనాలు కట్టినా బల్దియా అధికారులకు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి నిర్మాణాల వల్ల వరద కాల్వలు కుచించుకుపోయి వర్ష ఉధృతి పెరిగినపుడు రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి.
మూడేండ్లుగా ముందుకుసాగని పనులు
గ్రేటర్ పరిధిలో 391 కిలోమీటర్ల వరదనీటి కాల్వలు ఉంటే ఇందులో 314 కిలోమీటర్లకు సంబంధించి ఎలాంటి పనులను కూడా గత నాలుగేండ్లలో చేపట్టకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ యంత్రాంగం చేసిన పనుల ప్రకారమే.. మొదటి విడతలో 18.52 కిలోమీటర్ల నాలాలు విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు 47 పనులుగా టెండర్లను పిలవగా.. 46 ప్రాంతాల్లో పనులు అప్పగించారు. మిగిలిన ప్రాంతాల్లో మూడేండ్లలో 15 ప్రాంతాల్లో 6 కిలోమీటర్లలోపే విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మొదటి విడతలో 18 కిలోమీటర్ల పనులకు సంబంధించి రూ.689 కోట్లతో పనులను ప్రతిపాదించగా.. 9 పనులకు టెండర్ దశలోనే ఉన్నాయి. మరోవైపు ఆస్తుల సేకరణ జరగకపోవడంతో స్థలం అప్పగించలేదన్న కారణం చూపుతూ పలువురు కాంట్రాక్టర్లు టెండర్ రద్దు చేసుకున్నారు. గ్రేటర్‌లో 132 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 24 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లు.. మైత్రీవనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నెంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నీరు వెళ్లేందుకు క్యాచ్‌పిట్, మ్యాన్‌హోల్ మూతలు తీస్తుంటారు. ఇదీ ప్రమాదాలకు దారి తీస్తోంది.
వీటికి తోడు బాటిల్ నెక్ స్ట్రెచెస్ కూడా ఏర్పడటంతో వరద నీరంతా రోడ్ల మీదకు, ఇండ్లలోకి చేరుతున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో ఉన్ననీటి వ్యవస్థ గంటకు రెండు సెం.మీల వర్షం కురిస్తే సరిపోయేంత మాత్రమే ఉంది. ఇప్పటికీ అదే వ్యవస్థ ఉండటంతో పాటు 2014 నుంచి కొత్తగా వచ్చిన వర్షాల కారణంగా వరద నీటి ప్రమాదం మరింత పెరిగింది. మూడేండ్ల కింద ప్రతిపాదించిన పనులు 20 శాతం కూడా దాటలేదు. ఇంతలోనే కేటీఆర్ తాజాగా రూ.300 కోట్లను ప్రకటించారు. అయితే గతంలో కేటాయించిన రూ.230 కోట్లు పోగా కొత్తగా వచ్చింది రూ.70 కోట్లు మాత్రమే.. ముందుగా కేటాయించిన మొత్తానికి పనులు సక్రమంగా చేపడితే నేడు హైదరాబాద్ వరద నీటి సమస్యను కొంతైనా తప్పించుకునేది. నిధులు కేటాయింపులు, ప్రకటనలు తప్ప జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ చేపట్టిన పనులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాలాల విషయంలో సీరియస్‌గా తీసుకుని ప్రాణాలు పోకుండా చర్యలు వేగవంతం చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.