- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు షాక్.. RTC అధికారులకు కేసీఆర్ కీలక హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిందేనని యాజమాన్యం మరోసారి నొక్కి వక్కాణించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలన్నీ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్నాయని స్పష్టం చేశారు. డీజిల్ ధరల పెరుగుదలతో రూ.550 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ఈ పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఛార్జీల పెంపు మాత్రమే శరణ్యం
ఆర్టీసీ సమీక్ష సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాదిన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 వరకు పెరిగాయని, దీంతో ఆర్టీసీ పై రూ. 550 కోట్లు అదనపు ఆర్థిక భారం పడుతోందని అధికారులు వివరించారు. డీజిల్‌తో పాటు టైర్లు, ట్యూబులు, తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతోందని, వీటన్నిటి ద్వారా మొత్తంగా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయాల్సి వస్తోందని ముఖ్యమంత్రికి తెలిపారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెంపుతో ఆర్టీసి పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, లాక్డౌన్ కారణంగా సంస్థ సుమారుగా రూ.3000 కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందని ఆర్టీసీ అధికారులు వివరించారు. కేవలం హైద్రాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల వరకు నష్టం ఉంటుందని, రాష్ట్రంలోని 97 డిపోలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయని సీఎంకు విన్నవించారు. ఇలాంటి కష్టకాలంలో ఆర్టీసీ బస్‌ఛార్జీలు పెంచక తప్పదని, ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎంకు మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
అంతేకాకుండా గత ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రభుత్వం తరపున ప్రకటించారని, కరోనా కారణంగా ఛార్జీలను పెంచలేదని సీఎంకు గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని, ఇంకా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనకోవడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని, ఛార్జీలు పెంచితేనే కరోనానంతర పరిస్థితులు, పెరిగిన డీజిల్ ధరల ప్రభావం నుంచి బయటపడుతామని, లేకుంటే ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదంటూ సీఎంకు స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లోంచి బయటపడేందుకు ఛార్జీలు పెంచడంతో పాటుగా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టామని, పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభించామని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని వచ్చే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని, కేబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
విద్యుత్ ఛార్జీలూ పెంచాల్సిందే
అనంతరం రాష్ట్రంలో విద్యుత్తు అంశంపై మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌తో చర్చించారు. గత ఆరేండ్లుగా విద్యుత్ ఛార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ ఛార్జీలు పెంచాలని వారు సీఎంకు విన్నవించారు. ఆర్టీసీతో పాటు విద్యుత్ అంశాలకు సంబందించి రాబోయే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, సీఎస్సోమేష్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.