యూపీ గ్యాంగ్ రేప్ : ఆమె ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లినట్లు

by Anukaran |   ( Updated:2021-01-08 01:54:52.0  )
యూపీ గ్యాంగ్ రేప్ : ఆమె ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లినట్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం… ఆరవ వేదం.. మానభంగ పర్వంలో… మాతృహృదయ నిర్వేదం..అనే పాట గురించి మనందరికి తెలిసిందే. కలియుగంలో దుశ్శాసన పర్వం గురించి ప్రతిఘటన సినిమాలో తన ఆవేదనను పాటగా మలిచాడో సినీ కవి. అయితే యుగం ఏదైనా మృగాళ్లు మారడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు మనిషనేవాడిలో ఉన్న తోడేలు బయటకు వస్తోంది. పీక్కు తినడానికి, ఏ మాత్రం సందేహించడం లేదు. నిర్భయలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధుల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడడం లేదు.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ హాత్రాస్ దారుణం మరువకముందే బదూన్ జిల్లా మేవాలి గ్రామంలో 50ఏళ్ల మహిళపై కామాంధులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిర్భయ తరహాలో బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో ఐరన్ రాడ్డును జొప్పించి అత్యంత అమానుషానికి తెగబడ్డారు. దీంతో బాధితురాలి పక్కటెముకలు విరిగి కిడ్నీలు దెబ్బతిన్నాయి. తలకు తీవ్ర గాయమై మరణించింది. అనంతరం ఆమె డెడ్ బాడీని బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లారు నిందితులు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు హంత్‌ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌రాం, డ్రైవర్‌ జస్పాల్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

కానీ ఆ అమానవీయ ఘటన పట్ల దేశ ప్రజలు నిందితుల్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నా.., బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు, జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. బాధితురాలు ఇంటి నుంచి బయటకు రాకపోతే ఈ దారుణం జరిగేది కాదు. బయటకు వెళ్లేటప్పుడు ఎవరినైనా తీసుకుని వెళ్లి ఉంటే బాగుండేది. ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్‌ బట్టి అత్యాచార సంఘటన ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిందని మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రముఖి దేవి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చీఫ్ రేఖ శర్మ మండిపడ్డారు. రేఖా శర్మ మాట్లాడుతూ… ‘చంద్రముఖి ఇలా ఎలా వ్యాఖ్యానించిందో అర్థం కావడం లేదు. ఏ సమయంలోనైనా ఎక్కడైనా తిరిగేందుకు మహిళకు సర్వాధికారాలు ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంతో పాటు మనకు ఉందని’ ట్వీట్ చేశారు.

మరోవైపు పోలీసులు సైతం ఈ దారుణాన్ని లైట్ తీసుకుంటున్నారు. బాధితురాలి కేసు పట్ల, కుటుంబసభ్యుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచార నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ బాధితురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నరవుతున్నారు. కాగా ఈ కేసులో నిర్లక్ష్యంగా ప్రవర్తించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ శర్మ… స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వివరించారు.

Advertisement

Next Story