గుజరాత్ సీఎం, కేంద్ర హోం శాఖకి చంద్రబాబు లేఖలు

by Ramesh Goud |   ( Updated:2020-04-12 01:09:31.0  )
TDP
X

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 4 వేల మందిని రక్షించాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులతో పాటు ఇతరులు సుమారు 4,000 మంది గుజరాత్‌లో చిక్కుకుపోయారని బాబు ఆ లేఖలో వివరించారు.

గుజరాత్‌లోని సోమనాథ్ జిల్లాలో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారని ఆయన లేఖలో వెల్లడించారు. వారి యోగ క్షేమాల కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని లేఖలో వారికి వివరించారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు వారికి గుజరాత్‌లో ఆహారంతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలని లేఖలో చంద్రబాబు కోరారు.

వారికి రోజువారీ అవసరమైన నిత్యావసరాలు అందించాలని లేఖలో బాబు సూచించారు. వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని వారికి విన్నవించారు. వారందరికీ ప్రతినిధులుగా పేర్కొంటూ 11 మంది ఫోన్ నెంబర్లను లేఖకు జతచేశారు. వారి ద్వారా చిక్కుకుపోయిన 4 వేల మందికి సంరక్షణ చర్యలు చేపట్టవచ్చని ఆయన లేఖలో సూచించారు.

విపత్తు వేళ రాజకీయ ప్రయోజనాలపై దృష్టిపెట్టడం భావ్యం కాదని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్ ఏర్పాటుపై సర్వే సరికాదని సూచించారు. టీడీపీ పోలిట్ బ్యూరో తీర్మానించిన 15 అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. చాలా చోట్ల జేసీబీలతో ఇళ్ల స్థలాలు చదును చేయడం, యూనివర్సిటీల పాలకమండళ్లలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం సరికాదని ఆయన హెచ్చరించారు.

ఏపీలో కరోనా మూడో దశకు చేరడం ఆందోళనకు గురి చేస్తోందని ఆయన తెలిపారు. మొదటి, రెండో దశలో వైరస్‌ను నియంత్రించి ఉంటే ప్రమాదం తలెత్తేది కాదని, మూడో దశకు చేరాక పరిస్థితి చెయ్యిదాటిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆది నుంచి కరోనా తీవ్రతపై తాము హెచ్చరిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Tags: chandrababu naidu, tdp, letters to gujarat central home department, save 4,000

Advertisement

Next Story

Most Viewed