ఇదే వైఎస్సార్సీపీ మాయాజాలం: చంద్రబాబు

by srinivas |
TDP
X

దిశ ఏపీ బ్యూరో: పాత రుచి, కొత్త రంగు.. ఇదే వైఎస్సార్సీపీ మాయాజాలం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించిన ఆయన, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 36కి పైగా టీడీపీ పథకాలను రద్దు చేశారని, కొన్ని పథకాలకు పేర్లుమార్చి వైఎస్సార్సీపీ స్టిక్కర్లు వేసుకున్నారని ఆరోపించారు. పాలనలో తనదైన ముద్రవేయడం అంటే అధికార పార్టీ అర్థాలే వేరు అంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్సీపీ ఏడాది పాలన అంటే టీడీపీ పథకాలకు వైఎస్సార్సీపీ పేర్లు పెట్టుకోవడం, టీడీపీ నిర్మించిన భవనాలకు వైఎస్సార్సీపీ రంగులు వేసుకోవడం, స్కీములు రద్దు చేయడం, మసిపూసి మారేడుకాయ చేయడం వంటి నిర్వాకాలని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాగా చేయడమే వైఎస్సార్సీపీ మోసాలకు సాక్ష్యమని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పి అందులో రూ.6 వేలు ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు.

అన్నదాత సుఖీభవ పథకం, 4,5వ విడతల రుణమాఫీతో ప్రతి రైతుకు రూ.1.10 లక్షలు వచ్చేవని, కానీ రైతు భరోసా ముసుగులో ఒక్కోరైతుకు రూ.75 వేల మేర మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇచ్చినట్టే ఇచ్చి లాక్కోవడం మోసగాళ్ల పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్ వల్లే కియా మోటార్స్ వచ్చిందని చెబుతున్నారన్న ఆయన, 8 ఏళ్ల నాటి సున్నా వడ్డీ పథకాన్ని కూడా తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. పరుల కష్టానికి వైఎస్సార్సీపీ కబ్జా స్టిక్కర్ అంటే ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story