మూలధన వ్యయం పెంచాలని రాష్ట్రాలకు సూచించిన ఆర్థిక మంత్రి!

by Harish |
nirmala sitaraman
X

దిశ, వెబ్‌డెస్క్: పన్నుల రూపంలో రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తాన్ని రెట్టింపు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నెల 22న రెట్టింపు మొత్తం రూ.95,082 కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సాధారణంగా రాష్ట్రాలకు ఇచ్చే రూ.47,541 కోట్లకు బదులుగా నవంబర్‌ 22న మరో విడత అదనంగా ఇవ్వాలని ఆర్థిక కార్యదర్శికి సూచించినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా భారత్‌కున్న సానుకూల దృక్పథాన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రి సూచించారు.

మూలధన వ్యయం పెంచడమే కాకుండా ఇతర సమస్యలను పరిష్కరించి వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాలని వివరించారు. రాష్ట్రాల్లో ఉండే ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోవడం, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా వనరులను పెంచే మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు. ‘ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్ అనంతరం ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పుంజుకుంటోంది. ఎగుమతులు, దిగుమతులతో పాటు డిజిటల్ చెల్లింపులు, తయారీ, ఉత్పత్తి అన్ని విభాగాల్లోనూ కరోనా ముందునాటికి చేరుకున్నాయి.

కేంద్రం తీసుకునే నిర్మాణాత్మక సంస్కరణలతో అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అవకాశాలను రాష్ట్రాలు అందుకోవాలి. పెట్టుబడులను పెంచుకోవాలి’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు ఆస్తుల నుంచి నగదీకరణ ద్వారా కొత్త మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అవసరాలకు మూలధన అవసరాలకు వినియోగించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed