- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయకట్టు చివరి భూములకు ‘డ్రిప్’సిస్టమ్..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సాగునీటి ప్రాజెక్టులను రైతులకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు కేంద్రం డ్రిప్ (డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాం)ను రూపొందించింది. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద నిధుల లేమితో నిర్వహణ సామర్థ్యం కొరవడిన సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం పునరుద్ధరిస్తుంది. నిర్మాణ దశలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను గుర్తించి వాటినీ ఆధునీకరిస్తుంది. దీని కింద తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ. 650 కోట్ల నిధులు కేటాయించేందుకు కేంద్ర జల వనరుల శాఖ అంగీకరించింది.
29 ప్రాజెక్టుల ఎంపిక..
డ్రిప్ పథకం కింద సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యం పెంపొందించడంతోపాటు పూర్తి కాని అనేక ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దేశవ్యాప్తంగా ఇలాంటి 736 ప్రాజెక్టులను గుర్తించింది. తెలంగాణలో 29 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహకారంతో డ్రిప్ సంస్థ ఈ పనులను చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల రైతన్నలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్, పాకాల, లక్నవరం, రామప్ప, ఉస్మాన్‌సాగర్, పోచారం, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటితోపాటు రాష్ట్రంలోని పాలేరు డిండి, కోయిల్ సాగర్, కడం, మూసి ప్రాజెక్టు, స్వర్ణ, లోయర్ మానేరు డాం, మల్లూరు వాగు, బొగ్గుల వాగు, ఎన్టీఆర్ సాగర్, జూరాల ప్రాజెక్ట్, కౌలాస్ నాలా, సాత్నాల, సింగూరు, ఎల్లంపల్లి, వట్టి వాగు, గడ్డన్న వాగు, ఏ కే బీ ఆర్, పెద్దదేవులపల్లి, పిపి రావు ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టులను డ్రిప్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించనుంది.
ప్రాజెక్టులకు మహర్దశ..
కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద మంజూరు చేయనున్న నిధులతో రాష్ట్రంలోని 29 సాగునీటి ప్రాజెక్టులు అన్నదాతకు మెరుగైన సేవలు అందించనున్నాయి. ప్రాజెక్టుల కింద కాలువల నిర్మాణం, గేట్ల మరమ్మతులు, డ్యాం బండింగ్ పనులు, డ్యామ్ సేఫ్టీ వర్క్స్ వంటి వివిధ పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట ప్రారంభమై నిలిచిపోయిన ప్రాజెక్టులు, భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలోనే పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ సుభాష్‌ను సంప్రదించగా డ్రిప్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాజెక్టులు చేర్చినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ పథకం కింద పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులతోపాటు మరమ్మతులు అవసరమైన ప్రాజెక్టులు, డ్యాం సేఫ్టీ కింద జలాశయాలు అభివృద్ధి చెంది ఆయకట్టు భూములకు సాగునీరు అందే అవకాశం ఉందని వివరించారు.