నవంబర్‌లోనూ ‘అక్టోబర్’ నిబంధనలే

by Shamantha N |
నవంబర్‌లోనూ ‘అక్టోబర్’ నిబంధనలే
X

దిశ, వెబ్ డెస్క్ : నవంబర్ నెలలోనూ అక్టోబర్‌లో అమలవుతున్న నిబంధనలే అమలు కానున్నాయి. అక్టోబర్ నెల కోసం గతనెల 30న ప్రకటించిన నిబంధనలనే వచ్చే నెలకూ పొడిగించినట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్‌లోపల నవంబర్ చివరి వరకు కఠిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా కారణంగా మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌ నుంచి కంటైన్‌మెంట్ జోన్ వెలుపల దశలవారీగా మినహాయింపులను కేంద్రం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. హోంశాఖ అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం అవకాశమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

జన సంఖ్య ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న మెట్రో రైలు, షాపింగ్ మాళ్లు, హోటల్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, మతపరమైన ప్రాంతాలు తిరిగి తెరుచుకోవడానికీ అనుమతినిచ్చింది. కొన్ని నిర్ణయాలపై ఆంక్షలకు రాష్ట్రాలకు అనుమతినిచ్చింది. అలాగే, స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, 100 మందికి పైగా సమూహానికి సంబంధించిన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది. స్థానిక పరిస్థితులను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చింది. దీంతో చాలా వరకు కార్యకలాపాలు కరోనా జాగ్రత్తలతో తిరిగి ప్రారంభమయ్యాయి.

సాధారణ జీవితానికి తిరిగి దారులు వేసుకోవడానికి అన్‌లాక్ నిబంధనలు అని, మినహాయింపులు ఇచ్చినంత మాత్రానా కరోనా మహమ్మారి పోయినట్టు కాదని కేంద్రం హెచ్చరించింది. ఈ మినహాయింపులు ఇచ్చినప్పటికీ ప్రజలు మూడు జాగ్రత్తలను ఎట్టి పరిస్థితుల్లో మరువరాదని పేర్కొంది. మాస్కు ధరించడం, తరుచూ చేతులు శుభ్రంచేసుకోవడం, ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం అనే మూడు జాగ్రత్తలను ప్రజలందరూ తప్పక పాటించాలని కేంద్ర సర్కారు ప్రజలకు సూచించింది. వీటి అమలు కోసమే ప్రధాని మోడీ ఈ నెల 8న జన్ ఆందోళనల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం.

Advertisement

Next Story