వారు కూడా కరోనా టెస్టులకు రిఫర్ చేయొచ్చు : కేంద్రం

by Shamantha N |
వారు కూడా కరోనా టెస్టులకు రిఫర్ చేయొచ్చు : కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలోనే కేంద్రం అన్‌లాక్ 2.0 ప్రకటించింది. దీంతో మొన్నటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ వైరస్‌కు వెల్‌కమ్ చెప్పినట్లయ్యింది.దీంతో ప్రజల ప్రాణాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారికి కేంద్రం తీపి కబురు అందించింది. ఇకమీదట ప్రైవేటు వైద్యులు సహా క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్(క్యూఎంపీ) కూడా అనుమానితులకు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా టెస్టులకు సిఫారసు చేయవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు రంగంలో పరీక్షలు తక్కువగా జరగడంపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా రాసిన లేఖలో ప్రస్తావించింది.

కొవిడ్ 19 పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో టెస్టులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా లేఖలు రాసింది. కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు ఏ ఒక్కరిని కరోనా పరీక్షలు చేయించుకోకుండా అడ్డుకోవద్దని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు కేవలం ప్రభుత్వ డాక్టర్లు సూచించిన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలని సూచించడాన్ని ఉటంకిస్తూ కరోనా పరీక్షల్లో జాప్యం లేకుండా, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు పెంచాలని సూచించింది. లక్షణాలు ఉన్న వారిని పరీక్షించేందుకు పలు ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేయాలని, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఏ ఒక్కరిని కరోనా పరీక్షలు చేయించుకోకుండా అడ్డుకోవద్దని సూచించింది.

Advertisement

Next Story